మరిన్ని ‘జోషి మఠ్‌’లు!

9 Jan, 2023 05:53 IST|Sakshi
నేల కుంగడంతో జోషి మఠ్‌లో కూలిపోయిన ఓ ఆలయం

నైనిటాల్‌ వంటి పట్టణాలకూ ముప్పే

కుటుంబాల తరలింపు, పీఎంఓ సమీక్ష

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌లోని జోషి మఠ్‌లో ఇళ్లు పగుళ్లివ్వడానికి విపరీతమైన వర్షాల వల్ల భూమి క్రమక్షయం, నేల లోపలి భాగం గుల్లబారడం వంటివి కారణమని నిపుణులు చెబుతున్నారు. ‘‘వీటితో పాటు ఇష్టారాజ్యంగా తవ్వకాలు, ఇళ్లతో పాటు డ్యాముల వంటి భారీ నిర్మాణాలు కూడా సమస్యకు కారణమే. అయితే భూమి లోపలి పొరల్లోని (టెక్టానిక్‌) కదలికలే దీనికి ప్రధాన కారణం. ఇటీవల ఇది వేగం పుంజుకుంది. దీన్ని అడ్డుకోవడం మన చేతుల్లో లేదు ’’ అని వారంటున్నారు.

రాష్ట్రంలోని నైనిటాల్, ఉత్తరకాశి, చంపావత్‌ తదితర పట్టణాలకూ ఇలాంటి ముప్పు పొంచి ఉందని హెచ్చరిస్తున్నారు. ఈ ప్రాంతాల్లోని సున్నితం, బలహీనమైన నేల, దాని లోపలి పొరలతో ఎప్పటికైనా ప్రమాదమేనని చెబుతున్నారు. మరోవైపు, జోషి మఠ్‌ను కొండచరియలు విరిగిపడే ముప్పున్న ప్రాంతంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటిదాకా 60కి పైగా కుటుంబాలను ఖాళీ చేయించారు. మరో 90 కుటుంబాలను కూడా తరలించనున్నారు. కలెక్టర్‌ సారథ్యంలో ప్రభావిత ఇళ్ల పరిశీలన కొనసాగుతోంది.

పట్టణంలోని 4,500 పై చిలుకు ఇళ్లలో 610 ఇళ్లు పగుళ్లిచ్చి నివాసానికి పనికిరాకుండా పోయినట్టు గఢ్‌వాల్‌ కమిషనర్‌ సుశీల్‌కుమార్‌ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా సీఎం పుష్కర్‌సింగ్‌ ధామితో ఫోన్లో మాట్లాడి పరిస్థితిని ఆరా తీశారు. ఇప్పటిదాకా తీసుకున్న చర్యలపై నివేదిక కోరారు. ప్రధాని కార్యాలయం కూడా ఆదివారం దీనిపై ఉన్నత స్థాయి సమీక్ష జరిపింది. ప్రజల క్షేమమే తొలి ప్రాధాన్యమని ఒక ప్రకటనలో పేర్కొంది. ఐఐటీ రూర్కీ, జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా నిపుణులు కూడా సమీక్షలో పాల్గొన్నారు. జోషి మఠ్‌ పరిస్థితిపై హైదరాబాద్‌లోని నేషనల్‌ రిమోట్‌ సెన్సింగ్‌ సెంటర్, డెహ్రాడూన్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ రిమోట్‌ సెన్సింగ్‌ శాటిలైట్‌ ఇమేజరీ ద్వారా అధ్యయనం చేయనున్నాయి. 

మరిన్ని వార్తలు