జమ్మూ కశ్మీర్‌లో జోషిమఠ్‌ పరిస్థితులు.. కుంగుతున్న భూమి, ఇళ్లకు పగుళ్లు

3 Feb, 2023 16:55 IST|Sakshi

జమ్మూ కశ్మీర్‌లోని దోడా జిల్లాలో జోషిమఠ్‌ వంటి సంక్షోభ పరిస్థితులు నెలకొన్నాయి. ధాత్రి పట్టణంలోని నాయి బస్తీలో భూమి కుంగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. దీని కారణంగా బస్తీలోని 20కి పైగా ఇళ్లతోపాటు ఓ మసీదుకు పగుళ్లు ఏర్పడ్డాయి. దీంతో స్థానిక ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు మరోవైపు భూమి కుంగిపోవడంపై  స్పందించిన జిల్లా అధికారులు బాధిత కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తునట్లు వెల్లడించారు.

భవంతులకు పగుళ్లు ఏర్పడటంపై గల కారణాలను విశ్లేషించేందుకు నిపుణుల బృందాన్ని సదరు గ్రామాలకు పంపినట్లు తెలిపారు. ప్రజల భద్రతకు అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటున్నామని, వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటామని దోడా డిప్యూటీ కమిషనర్ విశేష్ మహాజన్ తెలిపారు. కాగా ధాత్రి మున్సిపల్ పరిధిలోని నాయి బస్తీ గ్రామంలో దాదాపు 50 ఇళ్లు ఉన్నాయి.

అయితే భూమి కుంగిపోవడానికి గల కారణాలపై దర్యాప్తు జరుపుతున్నామని ధాత్రి సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ అథర్ అమీన్ తెలిపారు. దోడా జిల్లాలో డిసెంబర్‌లో ఒక ఇంట్లో పగుళ్లు వచ్చాయని.. ఇప్పటి వరకు 20 భవనాలకు బీటల వారగా.. ఇప్పుడు ఆ సంఖ్య పెరుగుతోందన్నారు. దీని కారణంగా బస్తీ ప్రాంతం క్రమంగా కుంగిపోతుందని పేర్కొన్నారు. అయితే స్థానికంగా రోడ్ల నిర్మాణం, చుట్టుపక్కలా ప్రాంతాల్లో నది నీరు ప్రవహించడం వంటి అనేక కారణాలు కొండ పక్కనే ఉన్న గ్రామంలో భూమి కుంగిపోవడానికి కారణమని అధికారులు భావిస్తున్నారు.

కాగా భూమి కుంగిపోవడంతో ఉత్తరాఖండ్‌లోని జోషీమఠ్‌లో ఇళ్లకు పగుళ్లు రావడం తెలిసిందే. గత ఏడాది డిసెంబర్‌ 27 నుంచి ఈ ఏడాది జవవరి 8 మధ్య 12 రోజుల్లో సుమారు 5.4 సెంటీమీటర్ల మేర అక్కడి భూమి కుంగింది. ఇస్రో శాటిలైట్‌ చిత్రాల ద్వారా ఈ విషయం వెల్లడైంది. ఈ నేపథ్యంలో జోషిమఠ్‌లో నివసిస్తున్న169 కుటుంబాలను అధికారులు అక్కడి నుంచి తరలించారు. అలాగే ఎక్కువగా పగుళ్లు ఏర్పడిన ఇళ్లు, భవనాలను కూల్చివేస్తున్నారు.
చదవండి: విమానం టేకాఫ్‌ ఆలస్యం.. ప్రయాణికులు, సిబ్బంది మధ్య రచ్చ

మరిన్ని వార్తలు