చైనా, పాక్‌ భాష

18 Dec, 2022 06:09 IST|Sakshi

రాహుల్‌పై నడ్డా మండిపాటు

బహిష్కరించాలని కాంగ్రెస్‌కు డిమాండ్‌  

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ నాయకుడు రాహుల్‌ గాంధీ చైనా వ్యాఖ్యలపై రాజకీయ రగడ కొనసాగుతోంది. అరుణాచల్‌లోని తవాంగ్‌లో భారత జవాన్లను చైనా సైనికులు కొట్టారని రాహుల్‌ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. రాహుల్‌ నిరంతరం చైనా, పాకిస్తాన్‌ భాష మాట్లాడుతూ ఉంటారని బీజేపీ అధ్యక్షుడు నడ్డా ఆరోపించారు. శనివారం నడ్డా మీడియాతో మాట్లాడారు. రాహుల్‌ను కాంగ్రెస్‌ నుంచి వెంటనే బహిష్కరించాలని డిమాండ్‌ చేశారు.

సర్జికల్‌ దాడులు, బాలాకోట్‌ వైమానిక దాడులపై గతంలో రాహుల్‌ సందేహాలు వ్యక్తం చేశారని, ఇవన్నీ చూస్తుంటే ఆయనకున్న దేశభక్తి ప్రశ్నార్థకంగా మారిందన్నారు. రాహుల్‌ తన వ్యాఖ్యలతో సైనికుల నైతిక స్థైర్యాన్ని దెబ్బ తీస్తున్నారని మండిపడ్డారు. పార్టీని ఖర్గే తన నియంత్రణలోకి తీసుకొని రాహుల్‌ని పార్టీ నుంచి బహిష్కరించాలన్నారు. కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు చైనా కమ్యూనిస్టు పార్టీతో అవగాహన ఒప్పందం చేసుకున్నారని, అందుకే ఆ దేశ భాష రాహుల్‌ మాట్లాడుతూ ఉంటారని ఆరోపించారు. ఆర్మీపై రాహుల్‌కు నమ్మకం లేదని కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ ఆరోపించారు.

మరిన్ని వార్తలు