పశ్చిమ బెంగాల్‌లో ప్రజాస్వామ్యం లేదు: నడ్డా

10 Dec, 2020 20:44 IST|Sakshi

కోల్‌కత్తా : పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి, తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు మమతా బెనర్జీ.. బీజేపీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలవదంటూ ఎప్పుడూ అంటుంటారని, కానీ, తాము గెలిచి చూపిస్తామని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. గురువారం తన కాన్వాయ్‌పై రాళ్ల దాడి జరిగిన కొన్ని గంటల తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘వెయ్యి సవాళ్లు ఎదురైనా వాటిని ఎదుర్కొంటాం. ప్రజాప్రతినిధులకే రక్షణ లేకపోతే, సాధారణ పౌరుల పరిస్థితి ఏంటి?. ఇక్కడ ప్రజాస్వామ్యం లేదు. దాదాపు 130 మంది బీజేపీ కార్యకర్తలు హత్యకు గురయ్యారు.

బెంగాల్‌లో ప్రజా స్వామ్య వ్యవస్థే కుప్పకూలింది. రైతుల సంక్షేమం కోసం కేంద్రం పంపిన నిధులు 70 లక్షల మందికి అందలేదు. ఆయుస్మాన్‌ భారత్‌ పథకం ఫలాలు కూడా 4.67 కోట్ల మందికి అందలేద’’ని అన్నారు. కాగా, పశ్చిమ బెంగాల్‌ పర్యటనలో ఉన్న  నడ్డా, కైలాష్ విజయవర్గియా కాన్వాయ్‌లపై జరిగిన దాడిని కేం‍ద్ర హోంమంత్రి అమిత్‌షా సీరియస్‌గా తీసుకున్నారు. దీనిపై దర్యాప్తుకు ఆదేశించారు. రాష్ట్రంలోని శాంతి,భద్రతలపై పూర్తి నివేదికను ఇవ్వాలని గవర్నర్‌ను కోరారు.

>
మరిన్ని వార్తలు