పెట్టుబడుల ఉపసంహరణ ఎవరికి చేటు?

25 Mar, 2021 03:39 IST|Sakshi

విశ్లేషణ 

ఆర్థిక అభివృద్ధి మాత్రమే ప్రభుత్వ రంగ సంస్థల లక్ష్యం కాదు. ఇంతవరకు షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగలు, ఇతర వెనుగబడిన కులాలు, ఇటీవల ఆర్థికంగా వెనుకబడిన సెక్షన్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న అనేక మంది ప్రజలకు ప్రభుత్వరంగ సంస్థలు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ వచ్చాయి. ఈ అర్థంలో పీఎస్‌యూలు సామాజిక న్యాయానికి ఉపకరణాలుగా వ్యవహరించాయి. కానీ ప్రైవేట్‌ రంగంలో రిజర్వేషన్‌ లేకపోవడంతో ప్రభుత్వరంగ పరిశ్రమలను ప్రైవేటీకరించడం అంటే తొలిదశలో రిజర్వేషన్లను తప్పనిసరి చేసిన ఆ ’చారిత్రక అన్యాయా’న్ని పునరుద్ధరించడమే అవుతుంది కదా.

భారతదేశంలో ప్రభుత్వ రంగం అనేది ప్రధానంగా ప్రభుత్వ రంగ పరిశ్రమలకే (పీఎస్‌యూ) ప్రాతినిధ్యం వహిస్తుంటుంది. ఆర్థిక వృద్ధి, పెరుగుదలలో పీఎస్‌యులు పోషించే కీలకపాత్ర కారణంగా.. ఆర్థిక వ్యవస్థ తలుపులు తెరిచి ప్రభుత్వ గుత్తాధిపత్యం క్రమేణా ముగుస్తున్న కాలం లోనూ ప్రభుత్వరంగ సంస్థలు శిఖరస్థాయిలోనే ఉంటూ వచ్చాయి. 1991 తర్వాత రెండో తరం సంస్కరణలు ప్రభుత్వరంగ సంస్థలలో మొదలయ్యాయి. దీంతో పీఎస్‌యూలను మహారత్న, నవరత్న, మినీ రత్న అనే భాగాలుగా వర్గీకరించారు.  

పాలనాపరమైన, ఆర్థిక స్వయంప్రతిపత్తికి సంబంధించిన సంస్కరణలు, అవగాహనా ఒప్పందాల ద్వారా స్వీయ బాధ్యత వంటివి ప్రభుత్వం పీఎస్‌యూల ద్వారా సొంతంగా బిజినెస్‌ నిర్వహించాలనే భావనను ముందుకు తీసుకొచ్చాయి. ఈ పంథాలో తొలి లక్ష్యం నష్టాలు తెస్తున్న పీఎస్‌యూలను పునర్‌ వ్యవస్థీకరించడం. నష్టాలతో నడుస్తున్న పీఎస్‌యూలను వదిలించుకోవడానికి మొదటగా పెట్టుబడుల ఉపసంహరణ, ప్రైవేటీకరణలను ఒక ఐచ్ఛికంగా తీసుకొచ్చారు. రెండోది.. లాభదాయకంగా నడుస్తున్న పీఎస్‌యూలకు ఆర్థిక, పాలనాపరమైన స్వయంప్రతిపత్తిని అందించడమే. అయితే నష్టాలతో నడుస్తున్న పీఎస్‌యూలు కూడా ప్రభుత్వ రంగ సంస్థలు గానే చలామణి అవుతూ వచ్చాయి.

దీనికి పరిష్కారం ఏమిటంటే ఫ్రాన్స్, బ్రిటన్‌ దేశాల్లో ప్రోత్సహించినట్లుగా, కీన్సియన్‌ తరహా సంస్థలను పరిత్యజించడాన్ని ఒక ప్రత్యామ్నాయంగా ప్రోత్సహించడమే. అంటే సంక్షేమ రాజ్యంగా ఉంటున్న భారతదేశాన్ని నయా ఉదారవాద దేశంగా మార్చివేయడంలో ఇది ఒక భాగం. మొత్తం ప్రభుత్వ రంగాన్ని ప్రైవేటీకరించడమే లక్ష్యం అయినప్పటికీ, లాభదాయకంగా నడుస్తున్న పీఎస్‌యూల విషయంలో ఇది సమర్థనీయంగా ఉండదు. పైగా పీఎస్‌యూలనుంచి పెట్టుబడుల ఉపసంహరణను ప్రభుత్వ ఆధారిత అభివృద్ధిని ప్రోత్సహించడానికి అంటే సామాజిక సంక్షేమ ప్రభుత్వ లక్ష్యాన్ని చేరుకోవడానికి అని చెబుతూ రాజకీయంగా భాష్యం చెప్పారు.

పెట్టుబడుల ఉపసంహరణకు ఇది కొత్త భాష్యం అన్నమాట.సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ వెబినార్‌ ద్వారా పాల్గొన్న సదస్సులో ‘ప్రైవేటీకరణ, సంపదపై రాబడి’ అనే పేరుతో చేసిన ప్రసంగం యావత్తూ నయా ఉదారవాద ఎజెండాకు సంగ్రహరూపంగానే కనబడుతుంది. నష్టాలతో నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలకు పైకి లేవనెత్తడానికి పన్ను చెల్లింపుదారుల డబ్బును దుర్వినియోగపరుస్తున్నామని నరేంద్రమోదీ కూడా ఆవేదన వ్యక్తం చేశారు. నష్టాలతో నడిచే పీఎస్‌యూలకు వెచ్చించే డబ్బును సామాజిక, ఆర్థికాభివృద్ధికి ఉపయోగించుకోవచ్చని కూడా ఆయన సూచించారు. అలాగే మానవ వనరుల సమర్థ నిర్వహణ వాదాన్ని కూడా ప్రధాని తీసుకొచ్చారు.

ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేసే ప్రభుత్వోద్యోగులు తాము శిక్షణ పొందిన రంగంలో నేర్చుకున్న నైపుణ్యాలను ఉపయోగించలేకపోతున్నారని, అది వారి ప్రతిభకు అన్యాయం చేయడమే అవుతుందని ప్రధాని పేర్కొన్నారు. అయితే ప్రధాని చేసిన వెబినార్‌ ప్రసంగంలో నష్టాలతో నడుస్తున్న పీఎస్‌యూలను మాత్రమే ప్రైవేటీకరిస్తామనే చెప్పలేదు.  వ్యూహాత్మక రంగంలోని అతి కొద్ది పీఎస్‌యూలను మినహాయించి తక్కిన మొత్తం ప్రభుత్వ రంగ పరిశ్రమలకు ఈ ప్రైవేటీకరణ భావనను ఆయన విస్తరించడం విశేషం.

వ్యాపారంలో కొనసాగడం ప్రభుత్వం పని కాదనే పచ్చి నయా ఉదారవాద వాదనను ప్రధాని ఈ సందర్భంగా ముందుకు తీసుకొచ్చారు. ఈ వాదన పరిమితమైన ప్రభుత్వం, సత్పరిపాలన భావనకు సంబంధించింది.ఇక్కడ సత్పరిపాలన అంటే భాగస్వామ్యం, జవాబుదారీతనం, పారదర్శకం, బాధ్యతాయుతం, సమర్థవంతం, న్యాయబద్ధత, సమీకృతం, చట్టబద్ధత అనేటటువంటి భావజాలపరంగా తటస్థంగా ఉండే లక్షణాలను ముందుకు తీసుకురావడమే తప్ప మరేమీ కాదు. పరిమిత ప్రభుత్వం, అపరిమిత పాలన అనే నయా ఉదారవాద ఎజెండాను ఇది ముందుకు నెడుతుంది.

ప్రస్తుతం కేంద్రప్రభుత్వ విధాన నిర్ణయాల్లో ఈ సత్పరిపాలనా భావనే కేంద్ర స్థానంలో ఉంటోంది.ఇది సంక్షేమవాదం, నయా ఉదారవాదం భావనలపై భావజాలపరమైన చర్చలో భాగం కావచ్చు. కానీ ప్రజల చేత ఎన్నుకున్న ప్రభుత్వం ఆర్థికాభివృద్ధిని సాధించడం, పబ్లిక్‌ సెక్టర్‌ని సంస్కరించడం అనే లక్ష్యాల సాధనలో తన హక్కులను కాపాడుకోగలగాలి.మెజారిటీ ప్రజల ఎంపికద్వారా ఏర్పడిన ప్రభుత్వం ప్రాతినిధ్య ప్రజాస్వామ్యంలోనే నయా ఉదారవాద ఎజెండాను ముందుకు తీసుకురావడానికి కలలు కంటున్న పరిస్థితి ఇప్పుడు రాజ్యమేలుతోంది.

ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, ప్రభుత్వ రంగ సంస్థల్లో నయా ఉదారవాదాన్ని అమలు చేయడం ద్వారా కలిగే ఫలితాలు ఎలా ఉండబోతాయన్నదే.ఈ నయా ఉదారవాదంలోనూ సంక్షేమవాదం కొనసాగుతుంది. పెట్టుబడుల ఉపసంహరణ, ప్రైవేటీకరణ ద్వారా సేకరించిన నిధులను సరిగా ఉపయోగించడం ద్వారా ప్రధాని సూచించినట్లుగా పేదలకు ఇళ్లు, గ్రామాల్లో రహదారుల నిర్మాణం, పాఠశాలలు తెరవడం, పేదలకు పరిశుభ్రమైన నీటిని కల్పించడం వంటి సంక్షేమ చర్యలు చేపట్టవచ్చు.

మొదటగా ప్రభుత్వ రంగ సంస్థలను సంస్కరించడం ద్వారా ప్రభుత్వ గుత్తాధిపత్యానికి ముగింపు పలకవచ్చు. కానీ ఒక్క శాతంమంది అతి సంపన్నుల చేతిలో 40 శాతం దేశ సంపద పోగుపడి ఉన్న దేశంలో కొద్ది మంది బడా పెట్టుబడిదారుల చేతిలో అధికారాన్ని కేంద్రీకరించడం నుంచి ప్రైవేటీకరణను ఏది నిరోధించగలుగుతుంది అనేది పెద్ద ప్రశ్న. ఈ గుత్తాధిపతులు కేవలం పరిశ్రమ రంగంతో    పాటు ఇతర రంగాల్లో విధాన నిర్ణయాలను కూడా వీరు విశేషంగా ప్రభావితం చేయగలరు.రెండోది, ఆర్థిక అభివృద్ధి మాత్రమే ప్రభుత్వ రంగ సంస్థల లక్ష్యం కాదు.

ఇంతవరకు షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగలు, ఇతర వెనుగబడిన కులాలు, ఇటీవల ఆర్థికంగా వెనుకబడిన సెక్షన్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న అనేక మంది ప్రజలకు ప్రభుత్వరంగ సంస్థలు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ వచ్చాయి. ఈ అర్థంలో పీఎస్‌యూలు సామాజిక న్యాయానికి ఉపకరణాలుగా వ్యవహరించాయి. కానీ ప్రైవేట్‌ రంగంలో రిజర్వేషన్‌ లేకపోవడంతో ప్రభుత్వరంగ పరిశ్రమలను ప్రైవేటీకరించడం అంటే తొలిదశలో రిజర్వేషన్లను తప్పనిసరి చేసిన ఆ ’చారిత్రక అన్యాయా’న్ని పునరుద్ధరించడమే అవుతుంది కదా.మూడోది.

ప్రైవేటీకరణ ఒక ప్రభుత్వానికే పరిమితమైనది కాదు. పరిమిత ప్రభుత్వం అనేది ఉండదు. నయా ఉదారవాద ప్రభుత్వం అనేది వాస్తవంగా ఒక రెగ్యులేటరీ ప్రభుత్వం. పాలించడానికి అది నియంత్రణా వ్యవస్థలను రూపొందించి, చట్టాల అనువర్తనం, ప్రామాణిక ఆచరణలు లేదా సేవలకు హామీ ఇస్తుంది. పైగా తనదైన జాప్యందారీ వ్యవస్థలను రూపొందించుకుంటుంది. వీటిని సేవించడం ద్వారా ప్రభుత్వ ఉద్యోగులు తమ వృత్తికి న్యాయం చేకూర్చలేరు. బ్యాంకింగ్, విమానయాన రంగాల్లో దివాలాకు సంబంధించిన పలు కేసుల కారణంగా నష్టాల పాలవుతున్న ప్రైవేట్‌ కంపెనీల జాబితా మరింతగా పెరగడమే తప్ప తగ్గడం అనేది ఉండదు.

ప్రభుత్వం వ్యాపార సామర్థ్యంతోటే ఉండాలి:
ప్రభుత్వం కేవలం ఖర్చుపెట్టే సంస్థగానే ఉండిపోవలసిన అవసరం లేదు. సంపాదించే సంస్థగా కూడా ఉండాలి. వ్యాపారంలో కొనసాగినప్పుడు ఇది సాధ్యపడుతుంది. దీనికి చేయవలసిందల్లా ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉత్తమ పాలనను అమలు చేయడమే. లాభాలతో నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలు ఇతర పీఎస్‌యూలకు నమూనాగా ఉండాలి.

నష్టాలతో నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను కూడా సంస్కరించినట్లయితే, లాభాలబాట పట్టే ఆ సంస్థలు తిరిగి సాధికారత సాధించగలవు. ఉత్తమపాలన అనేది ప్రభుత్వ రంగ సంస్థలలో కూడా సమర్థతకు, ఆర్థికానికి, సామర్థ్యానికి, జవాబుదారీతనానికి హామీపడగలదు.


జుబేర్‌ నజీర్‌ 
వ్యాసకర్త అసిస్టెంట్‌ ప్రొఫెసర్, 
జామియా మిలియా ఇస్లామియా, న్యూఢిల్లీ 

మరిన్ని వార్తలు