జడ్జీలూ సోషల్‌ మీడియా బాధితులే

13 Sep, 2020 04:16 IST|Sakshi
జస్టిస్‌ ఎన్‌వీ రమణ

జస్టిస్‌ ఎన్వీ రమణ ఆవేదన

న్యూఢిల్లీ: అవాకులు చెవాకులు అర్థం పర్థం లేని నిందలు మోపుతూ చేసే సోషల్‌ మీడియా పోస్టింగులతో జడ్జీలూ బాధితులుగా మారుతున్నారని సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ తరహా పోస్టులకు జడ్జీలెవరూ స్పందించకుండా దూరంగా ఉంటే మంచిదన్నారు. సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ ఆర్‌ భానుమతి రచించిన ‘జ్యుడీషియరీ, జడ్జి అండ్‌ ది అడ్మినిస్ట్రేషన్‌ ఆఫ్‌ జస్టిస్‌’ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో జస్టిస్‌ రమణ మాట్లాడారు. జడ్జీలందరూ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారని భావించడం సరైంది కాదన్నారు.

ఇతర వ్యక్తుల కంటే జడ్జీల జీవితాలు ఏమంత మెరుగ్గా ఉండవని, ఒక్కోసారి కుటుంబ సభ్యులూ త్యాగాలు చేయాల్సి ఉంటుందన్నారు. సుప్రీంకోర్టు సీజే జస్టిస్‌ ఎస్‌ఏ బాబ్డే మాట్లాడుతూ న్యాయవ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. జడ్జీల వ్యక్తిగత లబ్ధి కోసమని కాకుండా, మొత్తం న్యాయవ్యవస్థ సమర్థంగా పని చేయడం కోసమైనా ప్రజలు స్వీయ నియంత్రణ పాటించాలని చెప్పారు. లాయర్‌ ప్రశాంత్‌ భూషణ్‌ న్యాయవ్యవస్థను కించపరిచేలా పోస్టింగులు చేసి రూ.1 జరిమానా కట్టిన నేపథ్యంలో జడ్జీలు ఈ వ్యాఖ్యలు చేశారు. రచయిత్రి జస్టిస్‌‡ భానుమతి మాట్లాడుతూ న్యాయవ్యవస్థలో విభిన్న కోణాలను పుస్తకంలో తన అభిప్రాయాలు చెప్పానన్నారు.

మరిన్ని వార్తలు