విచక్షణతో వ్యాఖ్యలు చెయ్యాలి

28 Nov, 2021 04:40 IST|Sakshi

వక్రభాష్యం ఇచ్చే అవకాశం కల్పించకూడదు

రాజ్యాంగ దిన ముగింపోత్సవంలో జడ్జీలకు రాష్ట్రపతి కోవింద్‌ హితవు

న్యూఢిల్లీ: న్యాయస్థానాల్లో జడ్జీలు వ్యాఖ్యలు చేసేటప్పుడు విచక్షణతో చేయాలని రాష్ట్రపతి కోవింద్‌ హితవు పలికారు. జడ్జీలు తమ వ్యాఖ్యలకి తప్పుడు భాష్యాలు కల్పించే అవకాశం ఇవ్వకూడదన్నారు. ఉద్దేశం మంచిదే అయినప్పటికీ  విక్షచణారహితంగా వ్యాఖ్యలు చేస్తే వాటిని సరిగా అర్థం చేసుకోలేరని అన్నారు. అంతిమంగా న్యాయవ్యవస్థ సక్రమంగా నడవదని అభిప్రాయపడ్డారు. సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో జరిగిన రాజ్యాంగదినోత్సవాల ముగింపు సమావేశంలో శనివారం కోవింద్‌ మాట్లాడారు. భారతీయ సంప్రదాయంలో న్యాయమూర్తులకు ఒక హోదా ఉందని, స్థితప్రజ్ఞతకు, నైతికతకు మారుపేరుగా వారు ఉంటారని కొనియాడారు.

‘మన దేశంలో తీర్పులిచ్చిన సమయంలో ఎంతో వివేకాన్ని ప్రదర్శిస్తూ వ్యాఖ్యలు చేసే న్యాయమూర్తులు ఎందరో ఉన్నారు. వారు చేసే వ్యాఖ్యలు భవిష్యత్‌ తరాలకు బాటలు వేసేలా ఉన్నాయి. అత్యున్నత ప్రమాణాలకే న్యాయవ్యవస్థ కట్టుబడి ఉన్నందుకు ఎంతో ఆనందంగా ఉంది’’ అని రాష్ట్రపతి వ్యాఖ్యానించారు. ‘ప్రజాస్వామ్యానికి న్యాయం మూలాధారం లాంటిది. శాసన, న్యాయ, కార్యనిర్వాహక వ్యవస్థలు సామరస్యపూర్వక ధోరణిలో కలిసి ముందుకు సాగినపుడే ప్రజాస్వామ్యం బలోపేతం అవుతుంది. రాజ్యాంగంలో ప్రతి వ్యవస్థకూ దాని పరిధిని నిర్దేశించారు. దానికి లోబడే ఈ వ్యవస్థలు పనిచేస్తాయి’ అని కోవింద్‌ అన్నారు.  

ఆ చట్టాలతో న్యాయవ్యవస్థపై భారం: సీజేఐ
ఈ కార్యక్రమంలో పాల్గొన్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ మాట్లాడుతూ శాసనవ్యవస్థ తాను చేసే చట్టాలు ఎలాంటి ప్రభావం చూపిస్తాయో అంచనా వేయకుండా, అధ్యయనాలు నిర్వహించకుండా వాటిని ఆమోదించడం వల్ల ఒక్కోసారి అతి పెద్ద సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని చెప్పారు. దాని వల్ల కేసుల సంఖ్య పెరిగిపోయి న్యాయవ్యవస్థపై పెనుభారం పడుతోందన్నారు. న్యాయస్థానాల్లో  మౌలిక సదుపాయాల్ని పెంచనంతవరకు పెండింగ్‌ కేసులు తగ్గుముఖం పట్టవని అన్నారు. పార్లమెంటు లేదంటే రాష్ట్రాల అసెంబ్లీలు చేసిన చట్టాలను, న్యాయస్థానాలు ఇచ్చే తీర్పులను అమలు చేయడం కష్టసాధ్యమనే పరిస్థితులు ఎప్పటికీ ఏర్పడకూడదని న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు అన్నారు.

మరిన్ని వార్తలు