మౌలిక సదుపాయాలు అధ్వానం

24 Oct, 2021 04:21 IST|Sakshi

న్యాయస్థానాల దుస్థితిపై కేంద్ర మంత్రి రిజిజు ఎదుటే సీజేఐ ఎన్‌.వి. రమణ ఆందోళన

న్యాయవ్యవస్థ మెరుగ్గా ఉంటేనే ఆర్థిక వృద్ధి జరుగుతుందని వ్యాఖ్య

ముంబైలోని ఔరంగాబాద్‌ బెంచ్‌ కోర్టు భవనాలు ప్రారంభించిన సీజేఐ  

ముంబై: దేశవ్యాప్తంగా న్యాయస్థానాల్లో  మౌలిక సదుపాయాలను మెరుగు పరచాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి. రమణ అన్నారు. అందరికీ న్యాయం అందాలంటే, న్యాయవ్యవస్థలో మౌలిక సదుపాయాలు అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. కానీ మన కోర్టుల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటు, నిర్వహణ ఒక ప్రణాళిక లేకుండా ఉండడం ఆందోళన కలిగిస్తోందన్నారు.

బాంబే హైకోర్టు ఔరంగాబాద్‌ బెంచ్‌కు చెందిన భవనాలను శనివారం సీజేఐ రమణ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే హాజరయ్యారు. న్యాయశాఖ మంత్రి ఎదుటే జస్టిస్‌ రమణ తన ఆవేదనంతా బయటపెట్టారు. దేశంలోని చాలా కోర్టుల్లో సరైన సదుపాయాలు లేవని, కొన్ని కోర్టు భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయని చెప్పారు.

మౌలిక సదుపాయాలు ఉంటేనే న్యాయవ్యవస్థ బాగుంటుందని, న్యాయవ్యవస్థ సమర్థంగా పనిచేస్తే ఆర్థిక రంగం వృద్ధి చెందుతుందని జస్టిస్‌ రమణ అభిప్రాయపడ్డారు. 2018లో సరైన సమయంలో తీర్పులు రాకపోవడం వల్ల దేశం వార్షిక జీడీపీలో 9% మూల్యం చెల్లించాల్సి వచ్చిందని ఒక అంతర్జాతీయ అధ్యయనంలో వెల్లడైనట్టుగా ఈ సందర్భంగా జస్టిస్‌ రమణ చెప్పారు.

ఇప్పుడు తాను ప్రారంభించిన ఔరంగాబాద్‌ కోర్టు భవన నిర్మాణం 2011లో మొదలైందని, అది పూర్తి కావడానికి పదేళ్లు పట్టిందంటే ప్రణాళికలో ఎన్ని లోపాలున్నాయో తెలుస్తోందని అన్నారు. కేవలం క్రిమినల్స్, బాధితులు మాత్రమే కోర్టు గుమ్మం తొక్కుతారన్న అభిప్రాయం ఇప్పటికీ సామాన్యుల్లో నెలకొని ఉందని.. చాలా మంది తాము అసలు కోర్టు ముఖం కూడా చూడలేదని గర్వంగా చెప్పుకుంటారన్న జస్టిస్‌ రమణ అలాంటి ఆలోచనల్ని రూపుమాపి అందరూ తమ హక్కుల సాధనకు కోర్టుకు వచ్చే పరిస్థితులు కల్పించాలన్నారు. ప్రజలు కోర్టుకు రావడానికి సంకోచపడే రోజులు పోవాలని, న్యాయవ్యవస్థపై విశ్వాసం ఉండడమే ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేస్తుందని
వ్యాఖ్యానించారు.  

దృఢమైన న్యాయవ్యవస్థతో ప్రజాస్వామ్యం విజయవంతం: రిజిజు
జస్టిస్‌ ఎన్‌.వి. రమణ మౌలిక సదుపాయాల అంశం గురించి ఆందోళన వ్యక్తం చేయడానికి ముందే కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్‌ రిజిజు తన ప్రసంగంలో ప్రజాస్వామ్యం విజయవంతం కావాలంటే దృఢమైన న్యాయవ్యవస్థ ఉండాలన్నారు. న్యాయవ్యవస్థలో మౌలిక సదుపాయాలు మెరుగుపరచడానికి కేంద్రం ఎన్నో చర్యలు చేపట్టిందన్నారు. కింది కోర్టుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.9 వేల కోట్లు కేటాయిస్తూ గత మంత్రివర్గ సమావేశంలోనే నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఈ బడ్జెట్‌తో 4 వేల కోర్టు భవనాలు, న్యాయమూర్తులకు 4 వేల నివాసాలు కట్టించి ఇస్తామని వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా న్యాయస్థానాల్లో మౌలిక సదుపాయాల ఏర్పాటుకు కట్టుబడి ఉన్నాయని రిజిజు చెప్పారు.   

కోర్టుల్లో పరిస్థితి ఇదీ..!  
కోర్టుల్లో మౌలికసదుపాయాలు ఎంత అధ్వానంగా ఉన్నాయో జస్టిస్‌ రమణ గణాంకాలతో సహా  వివరించారు. ‘‘దేశవ్యాప్తంగా 20,143 కోర్టు భవనాలు ఉన్నాయి. 16% కోర్టుల్లో కనీసం టాయిలెట్లు లేవు. 26% కోర్టుల్లో మహిళలకు ప్రత్యేకంగా టాయిలెట్‌ సదుపాయం లేదు. కేవలం 54% కోర్టుల్లోనే రక్షిత మంచినీరు లభిస్తోంది. 5% కోర్టుల్లో ప్రాథమిక వైద్య సదుపాయాలు ఉన్నాయి. 32% కోర్టుల్లో రికార్డు రూములు విడిగా ఉన్నాయి. 51%కోర్టుల్లో మాత్రమే లైబ్రరీ సదుపాయం ఉంది.  కేవలం 27% కోర్టుల్లో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా విచా రణ చేయడానికి వీలుగా న్యాయమూర్తుల టేబుల్‌పై కంప్యూటర్లు ఉన్నాయి’’ అని తెలిపారు. 

మరిన్ని వార్తలు