తీర్పుల్లో మానవీయ కోణం

24 Apr, 2022 06:04 IST|Sakshi

న్యాయమూర్తులకు సీజేఐ జస్టిస్‌ ఎన్‌వీ రమణ పిలుపు

నిబంధనలు, పద్ధతులను గుడ్డిగా అనుసరించరాదు

సామాజిక–ఆర్థిక అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి  

హైకోర్టుల్లో త్వరలో స్థానిక భాషలో కార్యకలాపాలు జరగవచ్చన్న సీజేఐ

చెన్నై/సాక్షి ప్రతినిధి, చెన్నై: న్యాయమూర్తులు తీర్పులిచ్చేటప్పుడు నిబంధనలు, పద్ధతులను గుడ్డిగా అనుసరించరాదని, మానవీయ కోణాన్ని దృష్టిలో పెట్టుకోవాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ సూచించారు. తీర్పులిచ్చే ముందు సామాజిక–ఆర్థికాంశాలను, సమాజంపై వాటి ప్రభావాన్ని కచ్చితంగా పరిగణనలోకి తీసుకోవాలని చెప్పారు. ‘‘నేటి ఇన్‌స్టంట్‌ నూడుల్స్‌ కాలంలో జనం కూడా ఇన్‌స్టంట్‌ జస్టిస్‌ (తక్షణ న్యాయం) కోరుకుంటున్నారు. దానివల్ల అసలైన న్యాయానికి అన్యాయం జరుగుతుందనే నిజాన్ని అర్థం చేసుకోవడం లేదు’’ అన్నారు. చెన్నైలో మద్రాస్‌ హైకోర్టు ప్రాంగణంలో పరిపాలనా భవన నిర్మాణానికి ఆయన శనివారం శంకుస్థాపన చేశారు.

అనంతరం మాట్లాడుతూ, కోర్టులతో న్యాయం జరుగుతుందని సామాన్య జనం గట్టిగా నమ్ముతున్నారని పేర్కొన్నారు. అయితే, ‘‘కోర్టుల పద్ధతులు, భాషతో వారు మమేకం కాలేకపోతున్నారు. న్యాయ వ్యవస్థలో సామాన్యులను సైతం భాగస్వాములుగా మార్చాలి. పెళ్లి మంత్రాల్లా కాకుండా కోర్టు వ్యవహారాలను, కేసుల పురోగతిని కక్షిదారులు అర్థం చేసుకోగలగాలి’’ అన్నారు. న్యాయ వ్యవస్థ, సంస్థల బలోపేతానికి అత్యధిక ప్రాధాన్యం ఇస్తున్నానని వివరించారు. ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలంటే న్యాయ వ్యవస్థ సక్రమంగా పనిచేయాలన్నారు. రాజ్యాంగ విలువలను పరిరక్షించాల్సిన బాధ్యత న్యాయ వ్యవస్థపై ఉందన్నారు. తీర్పు ఇవ్వడం అనేది కేవలం రాజ్యాంగ ధర్మం కాదు, అదొక సామాజిక బాధ్యత అని వెల్లడించారు. న్యాయమూర్తులు ఎప్పటికప్పుడు పరిజ్ఞానం పెంచుకోవాలని, ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవాలని సూచించారు.  

హైకోర్టుల్లో స్థానిక భాషలను ప్రవేశపెట్టడానికి కొన్ని అడ్డంకులు ఉన్నాయని జస్టిస్‌ ఎన్‌వీ రమణ చెప్పారు. సమీప భవిష్యతులో ఈ సమస్య పరిష్కారమవుతున్న నమ్మకం తనకు ఉందన్నారు. కృత్రిమ మేధ (ఏఐ)తో ఇది సాధ్యం కావొచ్చని అభిప్రాయపడ్డారు. గుర్తింపును, భాషను, సంస్కృతిని కాపాడుకోవడంలో తమిళ ప్రజలు ముందంజలో ఉంటారని ప్రశంసించారు. కార్యక్రమంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, పలువురు న్యాయమూర్తులు, న్యాయవాదులు పాల్గొన్నారు. దక్షిణాది రాష్ట్రాల కోసం సుప్రీంకోర్టు బెంచ్‌ను చెన్నైలో ఏర్పాటు చేయాలని స్టాలిన్‌ ఈ సందర్భంగా సీజేఐని కోరారు.

మాతృభాషను మరవొద్దు
మాతృభాష పరిరక్షణ విషయంలో తెలుగువారు తమిళులను ఆదర్శంగా తీసుకోవాలని జస్టిస్‌ ఎన్‌వీ రమణ ఉద్బోధించారు. చెన్నైలో ప్రపంచ తెలుగు సమాఖ్య (చెన్నై) 29వ వార్షికోత్సవంలో ఆయన మాట్లాడారు. ‘‘తెలుగు వారిని ఒకప్పుడు మదరాసీలు అనేవారు. తెలుగు భాష, సంస్కృతికి గుర్తింపు తెచ్చిన ఎన్టీఆర్‌ను ఈ సమయంలో స్మరించుకోవాలి. తెలుగు భాష పరిరక్షణకు కృషి చేయాలని ఇటీవల తెలుగు రాష్ట్రాల సీఎంలను కలిసినప్పుడు కోరా. చెన్నైలో ఒకప్పుడు తెలుగు వారు కూడా భాగస్వాములే. ఉమ్మడి మద్రాసు రాష్ట్రం విడిపోయాక కర్నూలు, తర్వాత హైదరాబాద్, ప్రస్తుతం అమరావతిని రాజధానులుగా చేసుకున్నాం. మాతృభాషలో మాట్లాడేందుకు సిగ్గుపడాల్సిన అవసరం లేదు. నేను డిగ్రీ దాకా తెలుగు మాధ్యమంలోనే చదువుకున్నా’’ అని చెప్పారు. తెలుగు ప్రజలు తమ మూలాలను ఎప్పటికీ మర్చిపోవద్దని సూచించారు. ఇతర భాషలు కూడా నేర్చుకోవాలని, మాతృభాషలో మాట్లాడడం వల్ల ప్రావీణ్యం పెరుగుతుందని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు