వైరల్‌: బాబా మాస్క్‌ భలే భలే!

24 May, 2021 12:55 IST|Sakshi

లక్నో: కరోనా వైరస్ ఫస్ట్‌ వేవ్ తరువాత సెకండ్‌ వేవ్ మొదలైంది. ఇది ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుంటోంది. ఈ సమయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. వీలైనంత వరకు ఇంట్లో ఉండడం, డబుల్‌ మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే తాజాగా ఉత్తర ప్రదేశ్‌కు చెందిన జుగాడు బాబా కరోనా నుంచి రక్షణ కోసం ప్రకృతి మాస్క్‌ ధరించాడు.

ప్రస్తుతం బాబా ధరించిన వేప, తులసి ఆకులతో తయారు చేసిన మాస్క్‌ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియోను రూపీన్‌ శర్మ అనే ఐపీఎస్‌ అధికారి ట్విటర్‌లో  పోస్టు చేస్తూ ‘‘ఈ మాస్క్‌ కరోనా నుంచి రక్షణ కల్పిస్తుందని కచ్చితంగా చెప్పలేం.కానీ అవసరం తల్లి లాంటిది’’ అని పేర్కొన్నాడు. ఓ వ్యక్తి ఆసక్తితో బాబా వద్దకు వచ్చి ఈ మాస్క్‌ ఎలా తయారు చేశారని అడిగాడు. దానికి ఆయన బదులిస్తూ.. వేప, తులసి ఆకులు ఏ రకమైన వ్యాధికైనా మంచి ఔషధంగా పనిచేస్తాయనేది మనకు తెలుసు. 

జనాలు సాధారణంగా ఉపయోగించే మాస్క్‌ల కంటే ఇది ప్రభావవంతంగా పనిచేస్తుందని భావిస్తున్నట్టు బాబా తెలిపారు. తులసి, వేప ఆకులతో చేసిన ఈ మాస్క్‌ నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది. కాగా జుగాడు బాబా ఉత్తర ప్రదేశ్‌లోని సీతాపూర్ జిల్లా బస్ స్టాండ్ వద్ద ఈ ప్రకృతి మాస్క్‌తో కనిపించారు.
 

(చదవండి: బంగ్లాదేశ్‌ మహిళా జర్నలిస్టు విడుదల)

మరిన్ని వార్తలు