5జీ పిటిషన్ విచారణలో హైడ్రామా, పాటలు పాడి.. ​

3 Jun, 2021 13:32 IST|Sakshi

5జీ టెక్నాలజీకి వ్యతిరేకంగా బాలీవుడ్ సీనియర్​ నటి జూహీచావ్లా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్​ విచారణ సందర్భంగా ఆమె వీరాభిమాని ఒకరు చేసిన పని జడ్జికి కోపం తెప్పించింది. దీంతో ఢిల్లీ పోలీసులు అతన్ని గుర్తించి.. కోర్టు ధిక్కార నోటీసులు అందించాలన్న ఆదేశాలు జారీ అయ్యాయి. 

ఢిల్లీ: నటి జూహీ చావ్లాతోపాటూ వీరేష్ మలిక్, టీనా వాచ్ఛానీ అనే మరో ఇద్దరు ఢిల్లీ హైకోర్టులో 5జీ టెక్నాలజీకి వ్యతిరేకంగా ఒక పిటిషన్ వేశారు. అయితే ఆమె విదేశాల్లో ఉండడం వల్ల కోర్టు విచారణకు స్వయంగా హాజరుకాలేకపోయింది. దీంతో బుధవారం వర్చువల్ విచారణ జరిగింది. అయితే అంతకంటే ముందే ఆమె కోర్టు వర్చువల్ విచారణ లింక్​ను అభిమానులతో షేర్​ చేసుకుంది.

తగ్గినట్లే తగ్గి.. 
జూహీ తరఫున న్యాయవాది దీపక్ ఖోస్లా తన వాదనలు వినిపిస్తున్న సమయంలో హఠాత్తుగా మధ్యలో ఓ వ్యక్తి కల్పించుకున్నాడు. ‘‘లాల్ లాల్ హోటోం పర్ గోరీ కిస్కా నామ్ హై”..అంటూ ఆ వ్యక్తి పాడాడు. సైలెంట్​గా ఉండాలని లేకుండా విచారణ నుంచి బైటికి వెళ్లాలని న్యాయమూర్తి కోరారు. కాసేపటి తర్వాత ‘‘మేరీ బన్నో కి ఆయేగీ బారాత్”మరో పాట వినిపించింది. దీంతో విచారణకు అంతరాయం కలగడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయమూర్తి జస్టిస్ మిధా, అంతరాయానికి కారణమైన వ్యక్తి గురించి ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేయాలని, అతన్ని గుర్తించి కోర్టు ధిక్కారం నోటీసులు అందించేలా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. ఈ విచారణలో సీనియర్​ న్యాయవాది కపిల్ సిబాల్ లాంటి ప్రముఖులు పాల్గొనడం విశేషం. అయితే ఆ వ్యక్తి మొదటి నుంచే విచారణకు అంతరాయం కలిగించినట్లు తెలుస్తోంది. ‘‘జూహీ మేడమ్ ఎక్కడ? నేను ఆమె డైహార్డ్​ ఫ్యాన్​ని. ఆమె నాకు కనిపించడం లేదు” అంటూ పదే పదే కామెంట్లతో విసిగించినట్లు ఢిల్లీ బార్ అండ్ బెంచ్ వెబ్ సైట్ వెల్లడించింది.


కాగా, వర్చువల్ విచారణలో పాట పాడిన జూహీ అభిమాని వ్యవహారంపై మరో నటి స్వరభాస్కర్​ వెటకారంగా స్పందించింది. ‘ఇది నాదేశం. ఈ దేశాన్ని ఎంతో ప్రేమిస్తున్నా. ఈ విచారణను ఆద్యాంతం ఆస్వాదించా’ అంటూ ఈ ఘటనపై ట్విట్టర్​లో స్పందించింది స్వరభాస్కర్​.


అసలు ఎందుకీ కేసు?
5జీ టెక్నాలజీ వల్ల తీవ్రమైన ప్రమాదాలు ఉన్నాయి. పౌరులకు ఎలాంటి ప్రమాదం లేదని ప్రభుత్వం ధ్రువీకరించేవరకూ 5జీని ఆపాలని మేం కోరుతున్నాం అని  జూహీచావ్లాతో సహా మిగతా ఇద్దరు పిటిషనర్లు కోరారు. దాదాపు 5 వేల పేజీల ఈ పిటిషన్‌లో డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్స్, సైన్స్ అండ్ ఇంజనీరింగ్ రీసెర్చ్ బోర్డ్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ లాంటి ఏజెన్సీలతో పాటు విశ్వవిద్యాలయాలు, ప్రపంచ ఆరోగ్య సంస్థను పక్షాలుగా చేర్చారు. అయితే ఇదంతా పబ్లిసిటీ స్టంట్​​ కోసమే అని, ఆమె పిటిషన్​ను కొట్టేయాలని కేంద్రం ఢిల్లీ హైకోర్టును కోరింది. చదవండి: ఫ్యాన్స్​కి జూమీ వింత రిక్వెస్ట్

మరిన్ని వార్తలు