సీజేఐగా జస్టిస్‌ ఎన్వీ రమణ

25 Apr, 2021 04:12 IST|Sakshi
జస్టిస్‌ ఎన్వీ రమణ చేత సీజేఐగా ప్రమాణం చేయిస్తున్న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌

ప్రమాణ స్వీకారం చేయించిన రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌

రాష్ట్రపతి భవన్‌లో కార్యక్రమానికి హాజరైన ఉపరాష్ట్రపతి, ప్రధాని

సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ నూతలపాటి వెంకటరమణ 48వ భారత ప్రధాన న్యాయమూర్తిగా శనివారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ జస్టిస్‌ ఎన్వీ రమణతో ప్రమాణ స్వీకారం చేయించారు. జస్టిస్‌ రమణ ఆంగ్లంలో దైవసాక్షిగా ప్రమాణం చేశారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని మోదీ, సుప్రీంకోర్టు జడ్జీలు, కేంద్రమంత్రులు, న్యాయ శాఖ ఉన్నతాధికారులు, జస్టిస్‌ ఎన్వీ రమణ కుటుంబసభ్యులు హాజరయ్యారు.

సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఎన్వీ రమణ 2022 ఆగస్ట్‌ 26వ తేదీ వరకు కొనసాగనున్నారు. దేశ అత్యున్నత న్యాయపీఠాన్ని అధిష్టించిన రెండవ తెలుగు వ్యక్తి జస్టిస్‌ ఎన్వీ రమణ కావడం విశేషం. గతంలో జస్టిస్‌ కోకా సుబ్బారావు 1966– 67 మధ్య భారత ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. 54 ఏళ్ల తర్వాత మళ్లీ ఒక తెలుగు వ్యక్తి సీజేఐగా బాధ్యతలు చేపట్టారు. సీజేఐగా శనివారం ఉదయం 11 గంటలకు ప్రమాణం చేశాక చీఫ్‌ జస్టిస్‌ రమణ నివాసంలో టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో వేద పండితులు ఆయనకు, ఆయన కుటుంబసభ్యులకు ఆశీర్వచనం చేశారు.  

2014లో సుప్రీంకోర్టుకు...
సీజేఐ నూతలపాటి వెంకటరమణ 1957 ఆగస్టు 27 న ఆంధ్రప్రదేశ్‌ కృష్ణా జిల్లాలోని పొన్నవరం గ్రామంలో జన్మించారు. 1983 ఫిబ్రవరి 10న ఆయన తన న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. అనంతరం ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు, సెంట్రల్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ట్రిబ్యునల్, సుప్రీంకోర్టులో ప్రాక్టీస్‌ చేశారు. 2000 సంవత్సరం జూన్‌ 27న ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు శాశ్వత న్యాయమూర్తిగా ఆయన నియమితులయ్యారు. 2013 మార్చి 10వ తేదీ నుంచి 2013 మే 20 వరకు ఆయన ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు యాక్టింగ్‌ చీఫ్‌ జస్టిస్‌గా పనిచేశారు. అనంతరం 2013 సెప్టెంబర్‌ 2వ తేదీన జస్టిస్‌ రమణకు ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి లభించింది.

2014 ఫిబ్రవరి 17న ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.  సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పలు కీలక కేసులను విచారించిన ధర్మాసనాలకు నేతృత్వం వహించగా, కొన్నింటిలో ఆయన సభ్యుడిగా ఉన్నారు. 2020 జనవరి 10వ తేదీన కశ్మీర్‌లో ఇంటర్నెట్‌ నిలిపివేయడాన్ని వెంటనే సమీక్షించాలని జస్టిస్‌ రమణ తీర్పు ఇచ్చారు. 2019 నవంబర్‌ 13న సీజేఐ కార్యాలయాన్ని ఆర్టీఐ పరిధిలోకి తీసుకురావాలని నిర్ణయించిన చారిత్రక ధర్మాసనంలో ఆయన సభ్యుడిగా ఉన్నారు. గృహిణులు ఇంట్లో చేసే పని, కార్యాలయాల్లో వారి భర్తలు చేసే పనికి ఏమాత్రం తక్కువేం కాదని జస్టిస్‌ రమణ, జస్టిస్‌ సూర్యకాంత్‌ల ధర్మాసనం తీర్పు ఇచ్చింది.

మరిన్ని వార్తలు