సీజేఐగా ప్రమాణ స్వీకారం చేసిన జస్టిస్‌ ఎన్వీ రమణ

24 Apr, 2021 11:23 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ నూతలపాటి వెంటక రమణ నేడు(శనివారం) బాధ్యతలు స్వీకరించారు. జస్టిస్‌ బాబ్డే పదవీ కాలం ముగియడంతో ఆయన స్థానంలో 48వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో ఉదయం 11 గంటలకు జస్టిస్ ఎన్వీ రమణతో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ ప్రమాణం స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, కేంద్రమంత్రులు, న్యాయమంత్రిత్వ శాఖ ఉన్నతాధికారుల, జస్టిస్ ఎన్వీ రమణ కుటుంబ సభ్యులు హాజరయ్యారు. 

1957 ఆగష్టు 27 వ తేదీన ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణాజిల్లా పొన్నవరం గ్రామంలో జన్మించిన ఎన్వీ రమణ.. 2000 సంవత్సరంలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా ఎంపికయ్యారు. ఆ తర్వాత ఏపీ హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా, ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించారు. 2014 ఫిబ్రవరి 17 వ తేదీన ఎన్వీ రమణ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వచ్చారు. జూన్ 27, 2000లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయమూర్తిగా నియమితులయ్యారు. దేశ అత్యున్నత న్యాయ పీఠం అధిష్టించిన రెండో తెలుగు వ్యక్తిగా జస్టిస్ ఎన్వీ రమణ చరిత్ర సృష్టించారు.

గతంలో 1966- 67లో జస్టిస్ కోకా సుబ్బారావు సీజేఐ పనిచేశారు. 54 ఏళ్ల తర్వాత మళ్లీ తెలుగు వ్యక్తి అత్యున్నత న్యాయం పీఠం ఎక్కారు. వచ్చే ఏడాది ఆగస్టు 26 వరకు అంటే 16 నెలల పాటు జస్టిస్ ఎన్వీ రమణ చీఫ్ జస్టిస్‌గా కొనసాగనున్నారు. ప్రస్తుతం దేశాన్ని కరోనా మహమ్మారి వణికిస్తున్న వేళ సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణ బాధ్యతలు చేపడుతున్నారు. కరోనా నియంత్రణ అంశంపై సుమోటో కేసును సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణ విచారణ జరుపబోతున్నారు. 

చదవండి: 48వ సీజేఐగా జస్టిస్‌ ఎన్వీ రమణ

మరిన్ని వార్తలు