జస్టిస్‌ పుష్పకు షాక్‌.. పదోన్నతి ఇవ్వని కేంద్రం

13 Feb, 2021 15:41 IST|Sakshi

నేరుగా బాలిక‌ శ‌రీరం తాకకుంటే తప్పులేదు

వివాదాస్పద తీర్పులతో వార్తల్లో జస్టిస్‌ పుష్ప

న్యూఢిల్లీ: బాలిక‌ల‌పై లైంగిక‌దాడి కేసులో వివాదాస్ప‌ద తీర్పులు ఇచ్చి దేశవ్యాప్తంగా సంచలనం రేపారు బాంబే హైకోర్టు న్యాయ‌మూర్తి జ‌స్టిస్ పుష్ప గ‌నేదివాలా. ఆ తీర్పులే ఆమె పదోన్నతికి ఎసరు పెట్టాయి. ఆమెకు పదోన్నతి కల్పించకుండా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో పుష్ప మరో ఏడాదిపాటు అద‌న‌పు న్యాయ‌మూర్తిగా కొనసాగనున్నారు. ఈ మేరకు అద‌న‌పు న్యాయ‌మూర్తిగానే కొన‌సాగిస్తూ కేంద్ర న్యాయ శాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది.

జస్టిస్‌ పుష్ప బాంబే హైకోర్టు అద‌న‌పు న్యాయ‌మూర్తిగా కొనసాగుతున్నారు. సాధారణంగా అద‌న‌పు న్యాయ‌మూర్తి ప‌ద‌వీకాలం రెండేళ్లు. ఈ లెక్కన జ‌స్టిస్ పుష్ప అద‌న‌పు న్యాయ‌మూర్తి ప‌ద‌వీకాలం శుక్ర‌వారంతో ముగిసింది. ఈ ప‌ద‌వీకాలం ముగిసిన త‌ర్వాత శాశ్వ‌త న్యాయ‌మూర్తిగా ఆమెకు ప‌దోన్న‌తి క‌ల్పించాలి. కానీ పదోన్నతి కల్పించకుండా కేంద్ర న్యాయశాఖ ఆమెకు షాకిచ్చింది. జ‌స్టిస్ పుష్ప‌కు శాశ్వ‌త న్యాయ‌మూర్తిగా ప‌దోన్న‌తి క‌ల్పించ‌కుండా.. మ‌రో ఏడాది కాలం పాటు ఆమె అద‌న‌పు న్యాయ‌మూర్తిగానే కొన‌సాగుతార‌ని కేంద్రం తెలిపింది. దీనికి గల కారణాలు ఆమె గతనెలలో ఇచ్చిన తీర్పులేనని బహిరంగ రహాస్యం. ఆమె వివాదాస్ప‌ద తీర్పులు ఇవ్వ‌డంతోనే సుప్రీంకోర్టు వెనుక‌డుగు వేసిందని తెలుస్తోంది.

ఆమె గతనెలలో ఇచ్చిన వివాదాస్పద తీర్పులు ఇవే..

  • ‘నేరుగా బాలిక‌ శ‌రీరాన్ని తాక‌న‌ప్పుడు ఆ కేసు పోక్సో కింద‌కు రాదు’ అని జ‌స్టిస్ పుష్ప తీర్పు ఇచ్చారు. ఈ తీర్పు దేశవ్యాప్తంగా వివాదాస్ప‌ద‌మైంది. 
  • ‘బాలిక చేతిని పట్టుకుని, అతను ప్యాంట్ జిప్ తెరిచినంత మాత్రాన పోక్సో చట్టం కింద దాన్ని లైంగిక దాడిగా పరిగణించలేం’ మరో కేసులో జస్టిస్‌ పుష్ప తెలిపారు. ఈ రెండు తీర్పుల‌ను గత నెలలో జ‌స్టిస్ పుష్ప ఇచ్చారు.

గతంలో జస్టిస్‌ పుష్ప బ్యాంకులు, బీమా కంపెనీలకు న్యాయవాదిగా పని చేసేవారు. దీంతో పాటు కొన్ని కళాశాలల్లో అధ్యాపకురాలిగా కొనసాగుతున్నారు. 2007లో జిల్లా జడ్జిగా ఆమె నియమితులు కాగా ఫిబ్రవరి 13, 2019లో బాంబే హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. పదోన్నతి వచ్చి ఉంటే శాశ్వత న్యాయమూర్తిగా ఆమె నియమితులయ్యే వారు.

మరిన్ని వార్తలు