మాజీ జడ్జి రాకేశ్‌ నేతృత్వంలో సిట్‌ దర్యాప్తు

18 Nov, 2021 05:42 IST|Sakshi

లఖీమ్‌పూర్‌ ఖేరీ కేసుపై సుప్రీంకోర్టు నిర్ణయం

సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌ డెప్యూటీ సీఎం కేశవ్‌ మౌర్య, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్‌ మిశ్రాల పర్యటన సందర్భంగా లఖీమ్‌పూర్‌లో రైతుల ఆందోళన, తర్వాత చెలరేగిన హింసాత్మక ఘటనల కేసుల దర్యాప్తు ఇకపై మాజీ జడ్జి రాకేశ్‌ కుమార్‌ జైన్‌ నేత్వత్వంలో కొనసాగనుంది. పంజాబ్, హరియాణా హైకోర్టులో జస్టిస్‌.రాకేశ్‌ కుమార్‌ గతంలో జడ్జిగా సేవలందించారు.

ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిపాదించిన జాబితాలోని ఐజీ ర్యాంక్‌ అధికారి పద్మజ చౌహాన్‌సహా యూపీ మాతృరాష్ట్రంకాని ముగ్గురు ఐపీఎస్‌ అధికారులు ఇకపై రాష్ట్ర ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌)లో భాగస్వాములుగా ఉంటారని సుప్రీంకోర్టు సీజే జస్టిస్‌ ఎన్‌వీ రమణ, జస్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ హిమాకోహ్లిల ధర్మాసనం వెల్లడించింది. సిట్‌ దర్యాప్తు పూర్తయ్యాక కోర్టులో చార్జ్‌షీట్‌ దాఖలుచేయాల్సి ఉంటుంది. ప్రస్తుత పరిస్థితిపై జస్టిస్‌ జైన్‌ ఒక నివేదికను కోర్టుకు సమర్పించాకే కేసుల విచారణ మొదలవుతుందని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది.

నలుగురు రైతులుసహా ఎనిమిది మంది మృతికి కారణమైన అక్టోబర్‌ 3నాటి రైతుల ఆందోళన, హింసాత్మక ఘటనల కేసుల పారదర్శక దర్యాప్తు కోసం వేరే రాష్ట్రానికి చెందిన జడ్జిని నియమిస్తామని సుప్రీంకోర్టు తెలపగా, అందుకు యూపీ సర్కార్‌ ఇటీవలే అంగీకరించడం తెల్సిందే. ఈ నేపథ్యంలోనే దర్యాప్తు బృందానికి కొత్త పర్యవేక్షకుడిని కోర్టు బుధవారం నియమించింది. హరియాణాలోని హిస్సార్‌లో 1958 అక్టోబర్‌ ఒకటిన జస్టిస్‌ జైన్‌ జన్మించారు. బీకాం ఎల్‌ఎల్‌బీ పూర్తిచేసిన జైన్‌ పంజాబ్, హరియాణా హైకోర్టు బార్‌లో 1982లో పేరు నమోదు చేయించుకున్నారు. తర్వాత హిస్సార్‌ జిల్లా కోర్టులో ప్రాక్టీసు ప్రారంభించారు. 1983 నుంచి హైకోర్టులో కేసులు వాదించారు.

మరిన్ని వార్తలు