హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులుగా జస్టిస్‌ రావు, జస్టిస్‌ భట్టి

27 May, 2023 06:17 IST|Sakshi

న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు న్యాయమూర్తులు హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తులుగా పదోన్నతి పొందారు. పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ మామిడాన సత్యరత్న శ్రీరామచంద్రరావు హిమాచల్‌ప్రదేశ్‌ హైకోర్టు ప్రధాన న్యాయ మూర్తిగా నియమితులయ్యారు. కేరళ హైకోర్టులో న్యాయమూర్తిగా సేవలందిస్తున్న జస్టిస్‌ సారస వెంకటనారాయణ భట్టి అదే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు. కేంద్ర న్యాయ శాఖ ఈ మేరకు శుక్రవారం నోటిఫికేషన్లు జారీ చేసింది.

హైదరాబాద్‌కు చెందిన జస్టిస్‌ రావు 2021లో జస్టిస్‌ హిమా కోహ్లీ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందిన నేపథ్యంలో తెలంగాణ హైకోర్టుకు కొంతకాలం పాటు తాత్కాలిక సీజేగా సేవలందించారు. జస్టిస్‌ భట్టి స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లె. వీరితో పాటు మరో ముగ్గురు న్యాయమూర్తులు జస్టిస్‌ విజయ్‌కుమార్‌ గంగాపూర్‌వాలా (మద్రాస్‌ హైకోర్టు), జస్టిస్‌ రమేశ్‌ దేవకీనందన్‌ ధనూకా (బాంబే హైకోర్టు), జస్టిస్‌ అగస్టీన్‌ జార్జి మాసి (రాజస్తాన్‌) కూడా పదోన్నతి పొందారు. జస్టిస్‌ ధనూకా ఈనెల 30న రిటైరవుతున్నారు.

మరిన్ని వార్తలు