హిందీ కన్నా అంబేడ్కర్‌కు సంస్కృతమే‌ ఇష్టం

15 Apr, 2021 02:19 IST|Sakshi

అధికార జాతీయ భాషగా సంస్కృతాన్ని అంబేడ్కర్‌ ప్రతిపాదించారు

జస్టిస్‌ ఎస్‌.ఎ.బాబ్డే

నాగపూర్‌: సంస్కృత భాషను భారతదేశ అధికార జాతీయ భాషగా ప్రకటించాలని రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ప్రతిపాదించారని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎస్‌.ఎ. బాబ్డే చెప్పారు. ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఆయనకు తెలుసని అన్నారు. అలాగే రాజకీయ, సామాజిక పరిస్థితులు కూడా అంబేడ్కర్‌ బాగా అర్థం చేసుకున్నారని తెలిపారు. అందుకే ఆ ప్రతిపాదన తెచ్చారని వెల్లడించారు. జస్టిస్‌ బాబ్డే బుధవారం నాగపూర్‌లో మహారాష్ట్ర నేషనల్‌ లా యూనివర్సిటీ (ఎంఎన్‌ఎల్‌యూ) అకడమిక్‌ బిల్డింగ్‌ను ప్రారంభించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే, కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ తదితరులు ఈ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్‌ బాబ్డే మాట్లాడుతూ.. మన ప్రాచీన మేధావులు న్యాయశాస్త్రం గురించి సమగ్రంగా బోధించారని గుర్తుచేశారు. అరిస్టాలిట్‌ వంటి పాశ్చాత్యుల బోధనకంటే ఇవి ఎందులోనూ తీసుపోవని అన్నారు. మన మేధావులు చెప్పిన విషయాలను పక్కనపెట్టడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు. కోర్టుల్లో ఏ భాష వాడాలన్నదానిపై సుప్రీంకోర్టుకు చాలా విజ్ఞాపనలు వచ్చాయని గుర్తుచేశారు. ఇలాంటి పరిస్థితి వస్తుందని అంబేడ్కర్‌ ముందే ఊహించారని, అందుకే సంస్కృతాన్ని దేశ అధికార జాతీయ భాషగా మార్చాలని ప్రతిపాదించారని తెలిపారు.

‘‘ఉత్తర భారతదేశంలో తమిళ భాషను అంగీకరించరన్నది అంబేడ్కర్‌ అభిప్రాయం. అలాగే దక్షిణ భారతదేశంలో హిందీని ఒప్పుకోరని ఆయన నిర్ణయానికొచ్చారు. అందుకే సంస్కృతాన్ని దేశ అధికార భాషగా ప్రకటిస్తే ఎవరికీ పెద్దగా అభ్యంతరాలు ఉండవని భావించారు. ఈ ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. కానీ, అది కార్యరూపం దాల్చలేదు’’ అని పేర్కొన్నారు. న్యాయవాద వృత్తిలో చేరేవారికి లా స్కూల్‌ ఒక నర్సరీలాంటిదన్నారు.
- జస్టిస్‌ ఎస్‌.ఎ.బాబ్డే, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి

మరిన్ని వార్తలు