కరోనా ఎఫెక్ట్‌: ‘కడక్‌నాథ్‌’కు ఫుల్లు డిమాండ్‌

28 Nov, 2020 16:06 IST|Sakshi

నల్లకోడిలో రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలు

ప్రతికూల పరిస్థితులను తట్టుకుని నిలబడగలవు

భోపాల్‌: కరోనా వైరస్‌ వ్యాప్తి మొదలైన నాటి నుంచి ప్రజల్లో ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రత మీద విపరీతమైన శ్రద్ధ పెరిగింది. కోవిడ్‌ బారిన పడకుండా ఉండటం కోసం.. రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం మీద దృష్టి పెట్టారు జనాలు. ఇందులో భాగంగా డ్రై ఫ్రూట్స్‌, పళ్లు, ఆకుకూరలు, కోడిగుడ్లు, మాంసాహారం ఎక్కువగా తీసుకోవడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో మధ్యప్రదేశ్‌ గిరిజన ప్రాంతం ఝూబువా, అలీరాజ్‌పూర్‌కే పరిమితం అయిన దేశీ నల్ల కోడి కడక్‌నాథ్‌కు ఫుల్‌ డిమాండ్‌ పెరిగింది. దీని వినియోగదారుల్లో ఎక్కువగా భోపాల్‌, ఇండోర్‌ వాసులు ఉన్నారు.

తాజాగా ఇక్కడ కోవిడ్‌ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. ఇండోర్‌లో గత నాలుగురోజుల్లో మొత్తం 500 కేసులు నమోదవ్వగా.. భోపాల్‌లో 300 కొత్త కేసులు వెలుగు చూశాయి. ప్రభుత్వ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘కరోనా వ్యాప్తి మొదలైన నాటి నుంచి కడక్‌నాథ్‌ కోడికి డిమాండ్‌ బాగా పెరిగింది. లాక్‌డౌన్‌ వల్ల కొద్దిగా తగ్గినప్పటికి ప్రస్తుతం అన్‌లాక్‌ అమల్లోకి రావడంతో మళ్లీ అమ్మకాలు పెరిగాయి. పౌల్ట్రీ ఫామ్ యజమానుల ఆదాయం పెరిగేలా చూడడానికి రాష్ట్ర ప్రభుత్వం ఈ జాతి కోళ్ల ఉత్పత్తి, అమ్మకాలను పెంచే ప్రణాళికను రూపొందించిందని తెలిపారు. (చదవండి: ‘కడక్‌నాథ్’‌ కోళ్ల బిజినెస్‌లోకి ధోని ఎంట్రీ!)

ఇక కడక్‌నాథ్‌ కోడి ప్రత్యేకత ఏంటంటే చికెన్‌ తోలు, మాంసం, గుడ్లు అన్ని నలుపు రంగులోనే ఉంటాయి. రోగనిరోధక శక్తిని పెంచే లక్షణాలను కలిగి ఉండటంతో పాటు, ఈ మాంసంలో కొవ్వు తక్కువగా.. ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. గుండె, శ్వాస, రక్తహీనత వ్యాధులతో బాధపడేవారికి ఈ చికెన్‌ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది అంటున్నారు నిపుణులు. అధిక రోగనిరోధక శక్తి గల కడక్‌నాథ్‌ జాతి కోళ్లు ప్రతికూల వాతావరణ పరిస్థితులను సైతం తట్టుకుని నిలబడగలవు. కాగా ఈ జాతి కోడి కిలో మాంసం 700-1,000 రూపాయల వరకు, గుడ్డు ధర 40–50 రూపాయలకు పైగానే ఉంటుందట.

మరిన్ని వార్తలు