నన్ను ఎన్‌కౌంటర్‌ చేయనందుకు సిట్‌కు థ్యాంక్స్‌: కఫీల్‌

2 Sep, 2020 16:11 IST|Sakshi
మథుర జైలు నుంచి విడుదలయిన వైద్యుడు కఫీల్‌ ఖాన్‌

యోగి ఆదిత్యనాథ్‌ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు

లక్నో: పౌరసత్వం (సవరణ) చట్టానికి(సీఏఏ) వ్యతిరేకంగా ప్రసంగించినందుకు కఠినమైన జాతీయ భద్రతా చట్టం (ఎన్‌ఎస్‌ఏ) కింద జైలు శిక్ష అనుభవిస్తోన్న ఉత్తరప్రదేశ్ వైద్యుడు కఫీల్ ఖాన్‌ మంగళవారం అర్ధరాత్రి మథుర జైలు నుంచి విడుదలయ్యారు. అలహాబాద్ హైకోర్టు ఆయన నిర్బంధాన్ని చట్టవిరుద్ధమని పేర్కొన్నది. ఆయన ఇచ్చిన ఉపన్యాసం ఎవ్వరిని రెచ్చగొట్టే విధంగా లేదని, అతడిని వెంటనే విడుదల చేయాలని అలహాబాద్ హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. దాంతో కఫీల్‌ ఖాన్‌ను మంగళవారం అర్ధరాత్రి మథుర జైలు నుంచి విడుదల చేశారు. ఈ సందర్భంగా హైకోర్టుకు కఫీల్ ఖాన్ ధన్యవాదాలు తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ‘నా విడుదల కోసం గొంతెత్తిన వారందరికీ ధన్యవాదాలు. నన్ను రిలీజ్‌ చేయడానికి అధికారులు ఏమాత్రం సుముఖంగా లేరు. ప్రజల ప్రార్థనల ఫలితంగా విడుదలయ్యాను. రాజధర్మాన్ని పాటించాలని వాల్మీకి మహర్షి రామాయణంలో బోధించారు. రాజు ‘రాజధర్మం’ ప్రకారమే వ్యవహరించాలి. కానీ యూపీలో అలా లేదు. రాజ ధర్మాన్ని అనుసరించాల్సింది పోయి, చిన్న పిల్లల్లా మొండిగా ప్రవర్తిస్తున్నారు’ అంటూ కఫీల్‌ ఖాన్‌ అసహనం వ్యక్తం చేశారు. (చదవండి: ఢిల్లీ అల్ల‌ర్లు: జామియా విద్యార్థినికి బెయిల్)

అంతేకాక ​​‘కోర్టు తన తీర్పును వెలువరించి ఎంతో మేలు చేసింది. అలా కాకుండా నిర్ణయాన్ని రాష్ట్రప్రభుత్వానికే వదిలేస్తే నన్ను చంపేసేవారు. సిట్‌కు కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. నన్ను ముంబై నుంచి మథురకు తీసుకెళ్లేటప్పుడు ఎన్‌కౌంటర్‌ చేయలేదు’ అంటూ కఫీల్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డాక్టర్‌ నిర్బంధంపై జిల్లా మేజిస్ట్రేట్‌ జారీ చేసిన ఉత్తర్వులు చట్టవిరుద్ధమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. తన కుమారుడికి ఫిబ్రవరిలోనే కోర్టు బెయిల్‌ మంజూరు చేసిందని, బెయిల్‌పై ఆయనను విడుదల చేయాల్సి ఉన్నా ఎన్‌ఎస్ఏ కింద నిర్బంధంలో ఉంచారని కఫీల్‌ ఖాన్‌ తల్లి పర్వీన్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. డాక్టర్‌ విడుదల పట్ల ఆయన కుటుంబీకులు హర్షం వ్యక్తం చేశారు. తన కుమారుడు ఎప్పుడూ దేశానికి వ్యతిరేకంగా మాట్లాడడని, చాలా మంచి వ్యక్తి అని కఫీల్‌ ఖాన్‌ తల్లి పేర్కొన్నారు. (చదవండి: ఆ తీర్మానం.. దేశ ద్రోహమే)

అసలు కేసేంటి..
2017లో గోరఖ్‌పూర్‌లో ఆక్సిజన్ అందక 60 మంది చిన్నపిల్లలు ప్రాణాలు కోల్పోయిన ఘటనలో డాక్టర్ కఫీల్ ఖాన్ పేరు తొలిసారి వెలుగులోకి వచ్చింది. చిన్నారులు చనిపోయిన బీఆర్‌డీ మెడికల్‌ కాలేజీలోనే పని చేసిన కఫీల్‌.. యోగి సర్కారుపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ క్రమంలో చిన్న పిల్లల మరణాలకు సంబంధించి ఆయనపై కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత ఆయనపై ఈ ఏడాది తీవ్రమైన జాతీయ భద్రతా చట్టం కింద కేసు నమోదయ్యింది. సీఏఏ వ్యతిరేక ఆందోళనల్లో రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారనే ఆరోపణలు రావడంతో కఫీల్‌ ఖాన్‌ను ఉద్యోగం నుంచి తొలగించారు. 2020, ఫిబ్రవరి 13న అలీగఢ్‌ జిల్లా మేజిస్ట్రేట్ ఆదేశాల మేరకు ఆయనను జాతీయ భద్రతా చట్టం 1980 సెక్షన్ 3 (2) ప్రకారం అరెస్టు చేశారు. అయితే, ఆయన నేరం చేశారనడానికి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో అలహాబాద్ హైకోర్టు ఎన్ఎస్ఏ ఆరోపణల్ని తోసిపుచ్చింది. అతడిని విడుదల చేయాలని ఆదేశించింది.
 

మరిన్ని వార్తలు