-

Cyber Crime: నేరగాళ్లకు సింహస్వప్నం..కామాక్షిశర్మ..

29 Jun, 2021 13:02 IST|Sakshi

లక్నో: ప్రస్తుతం నడుస్తోంది టెక్నాలజీ యుగం. ఈ సాంకేతికతను కొంత మంది తమ అభివృద్దికి, ఆవిష్కరణలకు ఉపయోగిస్తే.. మరికొంత మంది వక్ర మార్గంతో మోసాలకు పాల్పడుతున్నారు. నాణానికి ఇరువైపులా ఉండే, బొమ్మ బొరుసు మాదిరిగానే.. ప్రతి దాంట్లో మంచి చెడులు ఉంటాయి. మనం ఉపయోగించే విధానాన్ని బట్టి ఫలితాలు వస్తాయి. ఈ మధ్య కొంత మంది కేటుగాళ్లు,  సైబర్‌ క్రైమ్‌ నేరాలు, ఫోన్‌లో వేధింపులు, ఆన్‌లైన్‌ మోసాలు వంటివి పాల్పడుతున్న సంఘటనలు మనకు తెలిసిందే. అయితే, యూపీకి చెందిన ఒక యువతి ఇదే సాంకేతికతను ఉపయోగించి సైబర్‌ నేరగాళ్ల పాలిట సింహస్వప్నంలా మారింది. ఆమె తాజాగా సైబర్‌ నేరాల మీద 50 వేల మంది పోలీసులకు శిక్షణ ఇచ్చింది. దీంతో, ఆమెను ‘వరల్డ్‌ బుక్‌ ఆఫ్‌ రికా‍ర్డ్స్‌’ లో చేర్చారు. దీంతో  ప్రస్తుతం ఈమె వార్తల్లో నిలిచి అందరి ప్రశంసలను పొందుతోంది.

వివరాలు.. ఘజియాబాద్‌ చెందిన కామాక్షి శర్మ యువతి బీటేక్‌ చదివింది. ఆమెకు చిన్నతనం నుంచి టెక్నాలజీ అంటే ఇష్టం. తాను బీటేక్‌ చదివే రోజుల్లో సరదాగా తన మిత్రుల ఫేస్‌బుక్‌ ఖాతాల ఐడీలను వారు చెప్పకపోయినా తెలుసుకునేది. అప్పట్లో సరదాగా చేసినప్పడికీ ఇప్పుడు అదే ఆమె వృత్తిగా ఎంచుకుంది. ఈ క్రమంలో ఆమె టెక్నాలజీలో మంచి నైపుణ్యం సాధించింది. 2017లో కళాశాలలో ఉన్నప్పుడు తన మిత్రులు ఎవరైనా.. హ్యాకింగ్‌ కు గురైనా, వేధింపులు ఎదుర్కొన్నా​ కామాక్షిని సం‍ప్రదించేవారు. దీంతో ఆమె వెంటనే  నేరగాళ్లను కనిపెట్టేసేది. ఈ క్రమంలో..  కామాక్షికి ఘజియాబాద్‌ పోలీసులతో పరిచయం ఏర్పడింది. ఘజియాబాద్‌  పోలీసు వారు కొన్ని సెల్‌ఫోన్‌ చోరీ కేసులలో, ఐపీ అడ్రస్‌ను కనుగొనడంలో కామాక్షి సహకారం అందించింది. దీంతో,  పోలీసులు అనేక కేసులను తేలికగా ఛేదించారు.

ఈక్రమంలో ఆమె 2019లో సైబర్‌ మిషన్‌ను ప్రారంభించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ మిషన్‌తో ఇప్పటి వరకు జమ్ము-కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు 30 నగరాలలో సుమారు యూభైవేల మంది పోలీసులకు శిక్షణ ఇచ్చినట్లు తెలిపింది. అనేక పరిశోధన సంస్థలతో కలిసి పనిచేస్తున్నానని.. భారత సైన్యం కోసం ఫ్రీలాన్సర్‌గా కూడా సేవలందిస్తున్నట్లు వివరించింది. కాగా, ఇప్పటికే తాను ‘ఇండియా బుక్‌ఆఫ్‌ రికార్డ్స్​, ఆసియా బుక్‌ఆఫ్‌ రికార్డ్స్’లో చోటు సంపాదిచానని తెలిపింది. అయితే, ప్రపంచ దేశాల్లోని సైబర్‌ పోలీసులను ఒక ప్లాట్‌ఫాం పైకి తేవాలనేదే తన కోరిక అని చెప్పింది. ఈ ఆన్‌లైన్‌ మిషన్ లో ఢిల్లీ ఏసీపీ రాజ్‌పాల్‌ దాబస్‌, ఘజియాబాద్‌ ఇన్స్‌పెక్టర్‌ వినోద్‌ పాండెతో కలిసి పనిచేస్తున్నానని తెలిపింది. తామంతా.. ఒక టీమ్‌గా ఏర్పడి పాఠశాల స్థాయి నుంచి సైబర్‌ మోసాల బారినపడకుండా అవగాహన కల్పిస్తున్నామని తెలిపింది. 

చదవండి: ఆపదలో ఉన్న మహిళలను కాపాడే అస్త్రం దిశ యాప్: సీఎం జగన్

మరిన్ని వార్తలు