రీ పోలింగ్‌ కోరుతా!: కమల్‌ హాసన్‌

7 Apr, 2021 06:36 IST|Sakshi
ఓటు వేసేందుకు క్యూలో కమల్, అక్షర, శ్రుతిహాసన్‌

సాక్షి, చెన్నై: ఓటుకు నోటు, టోకెన్ల పంపిణీ అంటూ ఓటర్లను మభ్య పెట్టే ప్రయత్నాలు తీవ్రంగానే జరిగాయని, ఈ దృష్ట్యా, పరిస్థితులను బట్టి రీపోలింగ్‌ కోరుతామని మక్కల్‌ నీది మయ్యం నేత కమల్‌ తెలిపారు. కుమార్తెలు అక్షర, శ్రుతిహాసన్‌లతో కలిసి ఉదయాన్నే మైలాపూర్‌లో ఓటు హక్కును కమల్‌ వినియోగించుకున్నారు. ఈ ముగ్గురు క్యూలో నిలబడి ఓటు వేశారు. అనంతరం తాను పోటీచేస్తున్న కోయంబత్తూరు దక్షిణం నియోజకవర్గంలో పరిస్థితిని సమీక్షించేందుకు ప్రత్యేక విమానంలో కుమార్తెలతో పాటు కమల్‌ వెళ్లారు. పలు పోలింగ్‌ కేంద్రాల్ని సందర్శించారు.

కోంపట్టి పోలింగ్‌ బూత్‌ నుంచి బయటకు వస్తూ మీడియాతో మాట్లాడారు. తాను పోటీ చేస్తున్న నియోజకవర్గంలో నోట్లు, టోకెన్లు జోరుగానే పంపిణీ చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎవరు పంపిణీ చేశారో  ఆధారాలు సహా తన వద్ద ఉన్నాయని, ఈసీ దృష్టికి తీసుకెళ్లనున్నట్టు తెలిపారు. రీపోలింగ్‌కు పట్టుబడుతామని, ఒక్క కోవై దక్షిణంలోనే కాదు, రాష్ట్రంలో ఎన్నో నియోజకవర్గాల్లో ఈ తంతు సాగినట్టు ఆగ్రహం వ్యక్తంచేశారు. నామల్‌ తమిళర్‌ కట్చి నేత సీమాన్‌ వలసరవాక్కంలో ఓటు హక్కు వినియోగించుకున్న అనంత రం మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో నగదు తాండవం చేసిందని, కట్టడిలో ఎన్నికల యంత్రాంగం పూర్తిగా విఫలమైందని ఆగ్రహం వ్యక్తంచేశారు.
చదవండి: ఇది ప్రభుత్వంపై స్టార్‌ హీరోల నిరసన గళమా?‌

మరిన్ని వార్తలు