మూడో కూటమి సీఎం అభ్యర్థిగా కమల్ ఖరారు

10 Mar, 2021 04:05 IST|Sakshi

సాక్షి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వేళ కీలక పరిణామాలు సంభవించాయి. మూడు పార్టీలతో ఏర్పడిన మూడో కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ‘మక్కల్‌ నీది మయ్యం’(ఎంఎన్‌ఎం) అధ్యక్షుడు, నటుడు కమల్‌హాసన్‌ పేరు ఖరారు కాగా, సీట్ల పంపకం కుదరక ఏఐఏడీఎంకే కూటమితో తెగదెంపులు చేసుకుంటున్నట్లు డీఎండీకే ప్రకటించింది. దీంతో డీఎండీకేని మూడో కూటమిలో చేర్చుకునేందుకు కమల్‌ ప్రయత్నాలు ప్రారంభించారు. అన్నాడీఎంకే కూటమిలో కొనసాగిన ‘ఇండియా జన నాయక కట్చి’(ఐజేకే) గడిచిన లోక్‌సభ ఎన్నికల్లో డీఎంకే కూటమిలో చేరింది.

ఐజేకే వ్యవస్థాపక అధ్యక్షుడు పారివేందర్‌ పెరంబలూరు లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి గెలుపొందారు. అయితే ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే నుంచి 1, 2 స్థానాలు మాత్రమే దక్కే పరిస్థితి ఎదురవడంతో కూటమి నుంచి వైదొలిగారు. తన కుమారుడు రవి పచ్చముత్తును పార్టీ అధ్యక్షునిగా చేసి మూడో కూటమి సన్నాహాలు మొదలుపెట్టారు. సీట్ల సర్దుబాటుపై పిలుపు రాకపోవడంతో అలిగిన ‘సమత్తువ మక్కల్‌ కట్చి’ అధ్యక్షుడు శరత్‌కుమార్‌ అన్నాడీఎంకే కూటమిని వీడి ఐజేకే కూటమిలో చేరారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే, బీజేపీ మినహా మరే కూటమిలోనైనా చేరేందుకు ఎదురుచూస్తున్న కమల్‌ ఈ కూటమిలో చేరారు.

ఐజేకే కూటమి సీఎం అభ్యర్థిగా కమల్‌ బరిలోకి దిగుతున్నట్లు శరత్‌కుమార్‌ ప్రకటించారు. వీరి మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం.. ఎంఎన్‌ఎం 154, ఎస్‌ఎంకే, ఐజేకే చెరో 40 స్థానాల్లో పోటీ చేయనున్నాయి. ప్రజలకు విరోధులుగా వ్యవహరించే ప్రతి ఒక్కరినీ తాము లక్ష్యంగా చేసుకుంటామని కమల్‌ ప్రకటించారు. అన్నాడీఎంకే కూటమి నుంచి బయటకు వచ్చిన డీఎండీకేని కూడా కమల్‌ తమ కూటమిలోకి ఆహ్వానించారు. ప్రధాన ప్రతిపక్షం డీఎంకే కూటమిలో సీట్ల పంపకం  కొలిక్కి వచ్చింది. 234 స్థానాలకు గాను డీఎంకే 186 చోట్ల పోటీ చేయనుంది. కూటమిలోని కాంగ్రెస్‌కు 25, సీపీఐ, సీపీఎం, ఎండీఎంకే, వీసీకేలకు ఆరు చొప్పున, ఐయూఎంఎల్, ఎంఎంకేలకు కలిపి 5 సీట్లు కేటాయించింది.   

మరిన్ని వార్తలు