100 రోజుల్లో చేసి చూపిస్తా: కమల్‌ 

29 Mar, 2021 06:54 IST|Sakshi

సాక్షి, చెన్నై: పదేళ్లలో చేయలేని పనుల్ని వందరోజుల్లో చేసి చూపిస్తానని మక్కల్‌ నీది మయ్యం నేత కమలహాసన్‌ ధీమా వ్యక్తం చేశారు. భారత దేశానికే కోయంబత్తూరును ఆదర్శనగరంగా మార్చేస్తానని హామీ ఇచ్చారు. కోయంబత్తూరు దక్షిణం నియోజకవర్గంలో పోటీచేస్తున్న కమల్‌ ఆదివారం నియోజకవర్గంలో ఆగమేఘాలపై ప్రచారం చేశారు. రోడ్‌షో ద్వారా ప్రధాన మార్గాలు, చిన్న చిన్న వీధుల్లో సైతం దూసుకెళ్లారు. సినీ తరహా డైలాగులతో, రాజకీయఅంశాలతో, ప్రజాకర్షణ లక్ష్యంగా, ప్రజాసంక్షేమాన్ని కాంక్షిస్తూ తాము ప్రకటించిన మేనిఫెస్టోను వివరిస్తూ ముందుకుసాగారు.

పదేళ్లల్లో ఈ పాలకులు చేయలేని పనుల్ని వంద రోజుల్లో చేసి చూపిస్తానని ప్రకటించారు. ప్రజలు తనకు అండగా ఉంటే చాలు అని, మార్పు నినాదంతో రాష్ట్రం రూపురేఖల్ని మార్చేస్తానని ధీమా వ్యక్తం చేశారు. తనకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేసిన సవాల్‌ విషయంగా కమల్‌ స్పందిస్తూ, తన ప్రత్యర్థి బీజేపీకి చెందిన వానతీ శ్రీనివాసన్‌ ఓ డమ్మీ అంటూ, ఈ విషయంగా ప్రధాని మోదీతో చర్చించేందుకు సైతం సిద్ధం అని పేర్కొన్నారు. కమల్‌కు మద్దతుగా ఆ నియోజకవర్గంలో సినీ నటి, ఆయన అన్న చారుహాసన్‌ కుమార్తె సుహాసిని సుడిగాలి ప్రచారంలో నిమగ్నమయ్యారు. ఓటర్లతో మాట్లాడుతూ వారి సమస్యలు తెలుసుకుంటూ, కమల్‌ను ఆదరించాలని విజ్ఞప్తి చేశారు.
చదవండి: యాక్సిడెంటల్‌ హోం మినిస్టర్‌

మరిన్ని వార్తలు