నేను ఎంజీఆర్‌ రాజకీయ వారసుడ్ని: కమల్‌

17 Dec, 2020 06:59 IST|Sakshi

సాక్షి, చెన్నై: దివంగత ఎంజీఆర్‌ కలను సాకారం చేస్తే, ఆయనకు తానే రాజకీయ వారసుడ్ని అని మక్కల్‌ నీది మయ్యం నేత కమలహాసన్‌ వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం తిరునల్వేలి, కన్యాకుమారిలో కమల్‌ పర్యటించారు. విద్యార్థులు, యువ సమూహం, మహిళాలోకంతో సమావేశం అయ్యారు.  మీడియాతో కమల్‌ మాట్లాడుతూ రజనీ సిద్ధాంతాలు వేరు, తన సిద్ధాంతాలు వేరని, అయితే, తామిద్దరం మంచి మిత్రులం అని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో తమ సిద్ధాంతాలు ఒకే రకంగా ఉంటాయా అన్నది రజనీ చేయబోయే వ్యాఖ్యలు, నిర్ణయాలపై ఆధారపడి ఉందన్నారు.

మార్పు జరుగుతుందని ఆశిద్దామని, ఆయనతో రహస్యాలు ఏవీలేవు అని, బహిరంగంగానే రజనీకి తాను ఆహ్వానం పలికేశానని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. బహిరంగంగానే మళ్లీ పిలుస్తున్నానని, తన కూటమిలోకి రావాలంటూ చమత్కరించారు. టార్చ్‌లైట్‌ చిహ్నం కోసం ప్రయ త్నాలు చేస్తున్నారని, దక్కుతుందని భావిద్దామన్నారు. మక్కల్‌ నీది మయ్యం నేతృత్వంలో రాష్ట్రంలో మూడో కూటమి అన్నది సాధ్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయని పేర్కొంటూ, అందుకు తగ్గ పరిస్థితుల కోసం వేచి చూద్దామన్నారు. ఎంజీఆర్‌ కలను సాకారం చేయగలిగితే, ఆయనకు తానే వారసుడ్ని అని మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.  

వదులుకోను.. 
టార్చ్‌లైట్‌ చిహ్నం కోసం మక్కల్‌ నీది మయ్యం ఈసీని అభ్యర్థించేందుకు సిద్ధమైంది. ఈ చిహ్నంను వదులుకునే ప్రసక్తే లేదని ఎంజీఆర్‌ మక్కల్‌ కట్చి నేత విశ్వనాథన్‌ తెలిపారు. బుధవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ ఆ పార్టీ కన్నా ముందే, తాము సంఘంగా ఉన్నప్పుడే ఎన్నికల్లో పోటీ చేశామని, ఇప్పుడు రాజకీయపార్టీగా నమోదు చేసుకున్నామని గుర్తు చేశారు. తమకు టార్చ్‌లైట్‌ చిహ్నంను ఎన్నికల కమిషన్‌ కేటాయించిందని, కమల్‌ వచ్చి అభ్యర్థించినా, ఆ చిహ్నంను వదులుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.  

రాజకీయ ఆశ.. 
స్టార్లు అందరూ రాజకీయపార్టీలపై దృష్టిపెట్టడంతో నటుడు పార్థిబన్‌లోనూ ఆశలు చిగురించినట్టున్నాయి. పుదుచ్చేరిలో జరిగిన ఒత్త సెరుప్పు చిత్ర అవార్డు కార్యక్రమంలో పార్థిబన్‌ తన మదిలో మాటను బయటపెట్టారు. అందరూ రాజకీయపార్టీలు పెట్టేస్తున్నారని, విజయ్‌ కూడా పెట్టేస్తాడేమో అని పేర్కొంటూ, తాను ఓ రాజకీయపార్టీ పెట్టా లన్న ఆశతో ఉన్నట్టు, భవిష్యత్తులో ఇది జరుగుతుందేమో ఆ పార్టీకి పుదియపాదై అని పేరు పెట్టనున్నట్టు ప్రకటించారు. దీంతో చప్పట్లు మార్మో గాయి. చివరకు దీనిని సీరియస్‌గా తీసుకోకూడదని, కేవలం కామెడీ అంటూ ముగించారు. తన కుమార్తె రాజకీయాల్లోకి వస్తే, ఆమెకు మద్దతుగా ప్రచారం చేస్తానంటూ నటుడు సత్యరాజ్‌ ఓ మీడి యా ప్రశ్నకు సమాధానం ఇవ్వడం గమనార్హం.

మరిన్ని వార్తలు