ప్రభుత్వానికి కమల్‌ పది ప్రశ్నలు 

16 Sep, 2020 06:54 IST|Sakshi

సాక్షి, చెన్నై: అధికారాన్ని కాపాడుకోవడమే ప్రాతిపదికగా, ప్రజాసంక్షేమం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న పార్టీ అధినేతగా తన బాధ్యతను నెరవేర్చేందుకు ప్రభుత్వం ముందు ప్రశ్నలు పెడుతున్నానని మక్కల్‌ నీది మయ్యం (ఎంఎన్‌ఎం) అధ్యక్షులు, నటుడు కమలహాసన్‌ అన్నారు. ప్రజాప్రయోజనాలను ఆశిస్తూ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ప్రకటన విడుదల చేస్తున్నానని చెప్పారు. ఆ ప్రకటనలోని వివరాలు..   విద్యను రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా మార్పునకు ప్రయత్నాలు చేయకుండా, నీట్‌ రద్దుకు ఉన్న అవకాశాలను అందిపుచ్చుకుని కేంద్రప్రభుత్వాన్ని దారితెచ్చుకోలేదు. నీట్‌ పరీక్షకు సరైన శిక్షణావకాశాలను కల్పించకుండా ఎంతమంది విద్యార్థుల ప్రాణాలను బలిగొంటారు. నష్టపరిహారతో సమస్యను కప్పిపుచ్చాలని చూస్తున్నారా, జీవనాధారం కోల్పోయి అందే ఆర్థికసహాయం రైతన్నకు చెందకుండా దారిమళ్లింది. ప్రభుత్వం తన అవినీతిని కరోనా కాలంలో కూడా చాటుకోవడం న్యాయమా, ఆన్‌లైన్‌ విద్యాబోధనకు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యానికి పాల్పడింది.

ఆన్‌లైన్‌ విద్యాబోధనను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం ఏమి చేస్తుంది ? కరోనా కట్టడికి ముందు జాగ్రత్తలు తీసుకోకుండా చేతులు దులుపేసుకున్నారు. జీవనాధారం కోల్పోయిన ప్రజలకు ఏమి సమాధానం చెబుతారు ? కరోనా కష్టకాలంలో ఎనిమిది లేన్ల రోడ్డు కోసం ఎందుకు తహతహలాడుతున్నారు? రుతుపవనాలు, తుపాన్ల కాలంలో నష్టపోయేది మత్స్యకారులే. వారి వృత్తి రక్షణకు తీసుకున్న చర్యలు ఏమిటి ? చరిత్రలో ఎన్నడూ ఎరుగని  ఆర్థిక దుర్బర పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు, ఉద్యోగావకాశాల మెరుగుకు ఎలాంటి ప్రణాళికలు సిద్ధం చేశారు ? కేంద్ర ప్రభుత్వం నుంచి జీఎస్టీ వాటా పొందడంలో ఉదాసీనత ఎందుకు, ఒత్తిడి చేసేందుకు వెనకడుగు ఎందుకు ? ఈ అమ్మ ప్రభుత్వం టాస్మాక్‌లను మూసివేయడాన్ని ఎపుడు ప్రారంభిస్తారు ? ఈ రుతుపవనాల కాలంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇబ్బందులకు గురికాకుండా చేపట్టిన చర్యలు ఏమిటి ? ప్రజల తరఫున ప్రజల్లో ఒకడిగా అడిగిన ఈ పది ప్రశ్నలకు ప్రభుత్వం వద్ద సమాధానం ఉందా అని ఆ ప్రకటనలో కమల్‌ పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు