‘స్టార్‌’ హోదా రద్దుపై సుప్రీంకోర్టుకు కమల్‌నాథ్‌

1 Nov, 2020 06:01 IST|Sakshi

న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌ ఉప ఎన్నికల ప్రచారంలో తన స్టార్‌ క్యాంపెయినర్‌ హోదాను ఎన్నికల సంఘం (ఈసీ) రద్దు చేయడాన్ని సవాల్‌ చేస్తూ రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు కమల్‌నాథ్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అక్టోబర్‌ 13వ తేదీ నాటి తన ప్రసంగంపై బీజేపీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు చర్య తీసుకుంటున్నట్లు తెలిపిన ఈసీ.. ఎలాంటి నోటీసు ఇవ్వకుండా, తన వాదన వినకుండా ఇలాంటి చర్య తీసుకున్నట్లు ప్రకటించడం ప్రాథమిక హక్కులను కాలరాయడమేనని పేర్కొన్నారు.

ఈసీ ఉత్తర్వులపై స్టే విధించాలని కోరారు. ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి శివరాజ్‌ సింగ్‌నుద్దేశించి మాఫియా, కల్తీకోరు అంటూ కమల్‌నాథ్‌ తూలనాడటాన్ని ఈసీ సీరియస్‌గా తీసుకుంది. ఇటీవల కమల్‌నాథ్‌ రాష్ట్ర మహిళా మంత్రి, బీజేపీ అభ్యర్థిని ఇమార్తీదేవిని ‘ఐటెం’ అంటూ పేర్కొనడం వివాదాస్పదం అయింది. నిబంధనావళిని ఆయన పలుమార్లు అతిక్రమించారంటూ ఫిర్యాదులు అందడంతో ఈ మేరకు చర్య తీసుకుంటున్నట్లు ఈసీ శుక్రవారం ప్రకటించిన విషయం తెలిసిందే. స్టార్‌ క్యాంపెయినర్‌ హోదా ఉన్న నేత ప్రచార ఖర్చును సంబంధిత రాజకీయ పార్టీ భరిస్తుంది. ఆ హోదా లేకుంటే ఆ నేత ప్రచార ఖర్చంతా ఆ నియోజకవర్గ పార్టీ అభ్యర్థి ఖర్చు కిందికే వస్తుంది. మధ్యప్రదేశ్‌లోని 28 అసెంబ్లీ స్థానాలకు నవంబర్‌ 3వ తేదీన జరిగే ఉప ఎన్నికలకు ప్రచార గడువు నవంబర్‌ ఒకటో తేదీతో ముగియనుంది.

మరిన్ని వార్తలు