మెసేజ్‌ పెడితే చాలు వచ్చేస్తుంది: సరళా గోపాలన్‌

12 Aug, 2020 13:30 IST|Sakshi

చెన్నై: ‘‘అమెరికాలో ఉన్న నా ఫ్రెండ్‌ ఉదయం నాలుగు గంటలకే మెసేజ్‌ చేశారు. అప్పటి నుంచి మా కుటుంబమంతా సంతోషంలో మునిగిపోయింది. ఎంతో థ్రిల్లింగ్‌గా ఉంది. కమల మమ్మల్ని మరోసారి గర్వపడేలా చేసింది’’ అంటూ కమలా హారిస్‌ చిన్నమ్మ సరళా గోపాలన్‌ ఉద్వేగానికి లోనయ్యారు. తన అక్క కూతురు చిన్ననాటి నుంచే నాయకత్వ లక్షణాలు కలిగి ఉండేదని, తమ పట్ల ఎంతో ఆప్యాయత కనబరిచేదని గుర్తు చేసుకున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల బరిలో దిగిన జో బిడెన్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ రేసులో కమలా హారిస్‌ను నిలిపిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ అవకాశం దక్కించుకున్న తొలి నల్లజాతి మహిళగా ఆమె అరుదైన ఘనత సాధించారు. (అమ్మే నాకు స్ఫూర్తి.. రియల్‌ హీరో: కమలా హారిస్‌)

ఈ సందర్భంగా తమిళనాడుకు చెందిన కమలా హారిస్ తల్లి తరఫు బంధువులు ఆనంద డోలికల్లో తేలియాడుతున్నారు. కమలా హారిస్‌ తల్లి శ్యామలా గోపాలన్‌ సోదరి డాక్టర్‌ సరళా గోపాలన్‌ ఓ జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘తను అందమైన వ్యక్తిత్వం కలది. దయా హృదయురాలు. అందరితో ఆప్యాయంగా మెలుగుతుంది. ‘‘నాకు నీ అవసరం ఉంది కమల’’ అని ఒక్క మెసేజ్‌ పంపిస్తే చాలు సత్వరమే స్పందించి సమస్యను తీరుస్తుంది. అవసరమైతే వెంటనే ఇక్కడకు వచ్చేస్తుంది. అంత కేరింగ్‌గా ఉంటుంది తను. తనలో నాకు ఎక్కువగా నచ్చేది స్పందించే గుణమే’’అంటూ కూతురి గురించి చెప్పుకొంటూ మురిసిపోయారు. ప్రస్తుతం తను ఎన్నికల హడావుడిలో ఉంటుంది కాబట్టి మాట్లాడలేకపోయానని, త్వరలోనే తీపి కబురు వింటానంటూ హర్షం వ్యక్తం చేశారు.

కాగా కమలా హారిస్‌ తల్లి శ్యామలా గోపాలన్‌ తమిళనాడుకు చెందిన వారన్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో తమ బంధువులను కలిసేందుకు తన సోదరి మాయతో కలిసి ఆమె అనేకసార్లు భారత్‌కు వచ్చారు. ఇక తల్లిని తన రోల్‌మోడల్‌గా భావించే కమల.. పలు సందర్భాల్లో తన భారత మూలల గురించి గర్వంగా చెప్పుకొన్నారు. భారత సంస్కృతీ సంప్రదాయాలకు అనుగుణంగా తల్లి తమను పెంచారని, ఆమెతో పాటు తాతయ్య పీవీ గోపాలన్‌ తమపై ఎంతో ప్రభావం చూపారని చెప్పుకొచ్చారు. కాగా కమల తండ్రి డొనాల్డ్‌ హారిస్. యూనివర్సిటీ ఆఫ్‌ కాలిఫోర్నియాలో జమైకాకు చెందిన డొనాల్డ్‌తో శ్యామలా గోపాలన్‌కు ఏర్పడిన పరిచయం పెళ్లికి దారితీసింది. అయితే కమలా హారిస్‌కే ఏడేళ్ల వయసు ఉన్నపుడే వీరిద్దరు విడిపోయారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా