కంబళ క్రీడలో మెరుపు వీరులు 

12 Feb, 2021 16:47 IST|Sakshi

పరుగులో ఒలింపిక్స్‌ రికార్డులు బద్ధలు

మొన్న శ్రీనివాస్‌గౌడ, నేడు విశ్వనాథ్‌

ఆకట్టుకుంటున్న కర్ణాటక సంప్రదాయ క్రీడ

సాక్షి, బెంగళూరు: కర్ణాటక తీరప్రాంత జిల్లాల్లో బురదనీటిలో సాగే దున్నపోతుల పరుగు పందేలు కంబళలో ఒలింపిక్స్‌ పరుగు రికార్డులు బద్ధలవుతున్నాయి. బురదమడిలో వంద మీటర్ల దూరాన్ని కేవలం 9.15 సెకన్లలో దక్షిణ కన్నడ జిల్లా బైందూరుకు చెందిన విశ్వనాథ్‌ పూర్తి చేసి కొత్త రికార్డును నెలకొల్పాడు. గత శనివారం నిర్వహించిన పోటీల్లో విజేతగా నిలిచి అంతర్జాతీయ స్థాయిలో అందరి దృష్టి ఆకర్షించాడు. మొత్తం 125 మీటర్ల దూరాన్ని 11.44 సెకన్లలో పూర్తి చేశాడు. గతేడాది శ్రీనివాసగౌడ 9.55 సెకన్లలో, అదేవిధంగా నిశాంత్‌ శెట్టి 9.51 సెకన్లలో 100 మీటర్ల పరుగు సాధించి అప్పటికి సరికొత్త రికార్డును సృష్టించారు. విశ్వనాథ్‌ వీటిని అధిగమించాడు.  

ఉసేన్‌ బోల్ట్‌ కటే వేగంగా.. 
ప్రపంచ పరుగు పందెం విజేత ఉసేన్‌ బోల్ట్‌ రికార్డును మంగళూరుకు చెందిన శ్రీనివాసగౌడ అనే యువకుడు కొత్త చరిత్ర సృష్టించగా నిశాంత్‌ శెట్టి కూడా బోల్ట్‌ బద్దలు కొట్టాడు. ఈసారి బైందూరుకు చెందిన మరో యువకుడు విశ్వనాథ్‌ కూడా పాత రికార్డులన్నీ సవరించాడు. ఎన్నో ఏళ్ల కఠోర సాధన చేసినా ఈ స్థాయిలో రికార్డు సృష్టించడానికి పరుగు పందేలా క్రీడాకారులు ఆపసోపాలు పడుతుంటే కంబళ పోటీల్లో ఇంత అవలీలగా ఎలా సాధించేశారనే కుతూహలం అందరిలోనూ మొదలైంది.  

కరావళి సంప్రదాయమే.. 
కర్ణాటకలోని కరావళి ప్రాంతంగా పిలిచే ఉత్తరకన్నడ, దక్షిణ కన్నడ జిల్లాల్లో శతాబ్దాలుగా నిర్వహిస్తున్న క్రీడ పేరు కంబళ. కరావళి ప్రాంత సంస్కృతి, సంప్రదాయానికి ప్రతీకగా కంబళ క్రీడను భావించే ప్రజలు దాన్ని కాపాడుకోవడానికి పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంటారు. నవంబర్‌లో మొదలయ్యే కంబళ సీజన్‌ మార్చి వరకు కొనసాగుతుంది. కంబళ సమితుల ఆధ్వర్యంలో పోటీలు నిర్వహిస్తారు. 100 మీటర్లు అంత కంటే ఎక్కువ దూరం ఉండే ట్రాక్‌లు సిద్ధం చేసి వాటిలో కొద్దిమేర బురదనీటిని నింపుతారు. అనంతరం వాటిలో దున్నపోతులను పరుగెత్తించే పోటీలు నిర్వహిస్తారు. దున్నపోతులను అదుపు చేస్తూనే వేగంగా పరుగెత్తించి వాటితో పాటు అంతే వేగంతో పరుగెత్తి ఎవరైతే ముందుగా లక్ష్యాన్ని చేరుకుంటారో వారినే విజేతలుగా ప్రకటిస్తారు. 

క్రీడ ఒక్కటే.. ఎన్నెన్నో పోటీలు.. 
కంబళ పోటీల్లో ఏడు రకాల పోటీలు ఉన్నాయి. బారే కంబళ, కోరి కంబళ, అరసు కంబళ, దెవెరే కంబళ, బాలె కంబళ, కెరె కంబళ, కాద్రి కంబళగా విభజించారు. అయితే కంబళ క్రీడలో అన్ని కంబళలు పోటీ కంబళలు కావు. అందులో కొన్ని కంబళలు పోటీ కంబళలు.. కాగా మరికొన్ని పోటీ లేని సాధారణ కంబళలు. అయితే రెండు రకాల కంబళలను బురదనీటిలో నిర్వహిస్తారు. అన్ని రకాల కంబళలు మూడు శతాబ్దాలకు పైగానే చరిత్ర కలిగినవే. వీటిలో ఎక్కువశాతం దక్షిణ కన్నడ జిల్లాలోనే నిర్వహిస్తుండగా కొన్ని కంబళలు సమీపంలోని ఉడుపి జిల్లాలో నిర్వహిస్తారు. 

చరిత్ర ఏం చెబుతుందంటే.. 
కంబళ చరిత్ర గురించి తెలుసుకుంటే పరమ శివుడికి భక్తులైన నాథుల ప్రేరణతో కంబళ మొదలైనట్లు చెబుతారు. కంబళ క్రీడలు ప్రారంభమయ్యే ముందురోజు రాత్రి కొరగ తెగకు చెందిన పురుషులు కొరగ సాంస్కృతిక నృత్యాలు ప్రదర్శిస్తారు. అందులో భాగంగా పంచకర్మగా భావించే మద్య, మాంస, మత్స్య, ముద్ర, మిథున (రతి) పాటిస్తారు. దీంతో పాటు పానిక్కులుని అనే సాంస్కృతిక వేడుకను సైతం నిర్వహిస్తారు. 

పోటీలు.. విభాగాలు..
కంబళ పోటీల్లో కొన్ని రకాల పోటీలను ప్రత్యేక విభాగాలుగా విభజిస్తారు. వాటిలో నెగిలు, హగ్గ, అడ్డా హాలేజ్, కేన్‌ హాలేజ్‌ ప్రధానమైనవి. ఒక్కో రకమైన కంబళకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తారు. వాటి గురించి తెలుసుకుందాం. 

► నెగిలు: చెక్క లేదా ఇనుముతో తయారు చేసిన ఓ రకమైన భారీ నాగలితో నిర్వహించే పోటీని నెగిలుగా గుర్తిస్తారు. ఈ భారీ నాగలి ని దున్నలకు కట్టి బురదనీటిలో పరుగెత్తి స్తారు. ఇందులో కేవలం ఎంట్రీ స్థాయి, జూనియర్, సీనియర్‌ రౌండ్లు మాత్రమే ఉంటాయి. 

► హగ్గ: ఈ విభాగంలో పాల్గొనే దున్నలకు అనుభవం ఎక్కువగా ఉంటుంది. బలమైన తాడును దున్నలకు కట్టి బురదనీటిలో పరుగెత్తిస్తారు. ఇందులో ఓ వ్యక్తి చేతిలో తాడుతో దున్నలను నియంత్రిస్తూ వాటితో పాటు బురద నీటిలో పరుగెత్తుతాడు. ఇందులోనూ సీనియర్, జూనియర్‌ రౌండ్లు ఉంటాయి.  

► అడ్డా హాలేజ్‌: ఈ విభాగం కఠినంగానే ఉంటుంది. వంపు తిరిగిన చెక్కను దున్నలకు కట్టి బురదనీటిలో పరుగెత్తిస్తారు. ఈ సమయంలో చెక్కపలకపై వ్యక్తి నిలబడి ఉంటాడు. దీంతో పోటీలో పాల్గొనే దున్నలు చెక్కతో పాటు వ్యక్తిని సైతం బురదనీటిలో వేగంగా లాక్కెళ్తాయి. ఇందులో సీనియర్‌ రౌండ్‌ మాత్రమే ఉంటుంది. 

కేన్‌ హాలేజ్‌: ఈ రకం పోటీలు ఎంతో రసవత్తరంగా, ఉత్కంఠగా ఉంటాయి. ప్రత్యేకంగా తయారు చేసిన గుండ్రటి చెక్కను దున్నలకు కడతారు. చెక్కకు మధ్యలో రెండు ప్రత్యేకమైన రంధ్రాలు ఏర్పాటు చేస్తారు. దున్నలు పరిగెత్తే సమయంలో ఈ రెండు రంధ్రాల నుంచి చిమ్మే నీటి ఎత్తు, వేగంతో విజేతను ఎన్నుకుంటారు. ఇందులో సూపర్‌ సీనియర్‌ రౌండ్‌ మాత్రమే ఉంటుంది. 

చదవండి:
మిస్‌ ఇండియా రన్నరప్‌గా ఆటో డ్రైవర్ కూతురు

ఆమె కోసం ఇల్లమ్మి.. ఆటోలోనే తిండి, నిద్ర

మరిన్ని వార్తలు