ఇక పొలిటికల్‌ వార్‌.. ‘లోక్‌సభ ఎన్నికల్లో అక్కడి నుంచి పోటీ చేస్తా’

29 Oct, 2022 15:38 IST|Sakshi

కంగనా రనౌత్‌ ఈ పేరు వినగానే ప్రముఖ బాలీవుడ్‌ నటి అని గుర్తుకు వస్తుంది. ఇకపై కంగనా.. అటు సినిమా రంగంతో పాటుగా ఇటు పొలిటికల్‌గానూ తన మార్క్‌ చూపించనున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికి వరకు సినిమా రంగంలో పలు అంశాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వార్తల్లో నిలిచిన కంగనా.. పలు సందర్భాల్లో బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. 

ఇక, తాజాగా తన పొలిటికల్‌ ఎంట్రీపై కంగనా రనౌత్‌ ఎట్టకేలకు స్పందించారు. ప్రజలు కోరుకుంటే, బీజేపీ అవకాశం ఇస్తే తాను వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానంటూ తన మదిలోని మాటలను వ్యక్తపరిచారు. అయితే, హిమాచల్‌ ప్రదేశ్‌లో ఉన్న కంగనా శనివారం ఆజ్‌ తక్‌ పంచాయత్‌ కార్యాక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా కంగనా రనౌత్‌ మాట్లాడుతూ.. హిమాచల్‌ ప్రజలు కోరుకుంటే, తనకు బీజేపీ టికెట్‌ ఇస్తే.. 2024 లోక్‌సభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్‌లోని మండి నుంచి పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. 

ఇదే క్రమంలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై కంగనా ప్రశంసల జల్లు కురిపించారు. ప్రధాని మోదీ.. మహాపురుష్‌ అంటూ వ్యాఖ్యలు చేశారు. అలాగే, మోదీకి రాహుల్‌ గాంధీ ప్రత్యర్థి కావడం విచారకరం. అయినా, మోదీజీకి ప్రత్యర్థులు లేరని తనకు తెలుసని అన్నారు. అనంతరం.. ఆమ్‌ ఆద్మీ పార్టీ, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌పై సెటైరికల్‌ కామెంట్స్‌ చేశారు. ఆప్‌ తప్పుడు వాగ్దానాలను హిమాచల్‌ ప్రదేశ్‌ ప్రజలు అర్థం చేసుకుంటారు. హిమాచల్‌ ప్రజలు వారి సొంత సోలార్‌ పవర్‌ ఆధారంగా పంటలు పండిస్తున్నారు. ఆప్‌ పార్టీ ఇస్తున్న ఉచిత పథకాలు ఇక్కడ పనికిరావు అంటూ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. 

మరిన్ని వార్తలు