కొడుకు కోసమే కక్షసాధింపు

15 Sep, 2020 04:01 IST|Sakshi
మొహాలీ ఎయిర్‌పోర్ట్‌లో కంగనా రనౌత్‌

మూవీ మాఫియా, డ్రగ్‌ రాకెట్‌తో ఆదిత్య ఠాక్రేకు సంబంధాలు

గుట్టు రట్టు చేశానని కత్తి కట్టారు

ఉద్దవ్‌పై మరోమారు కంగనా ఫైర్‌

ముంబై: బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్, అధికార శివసేన పార్టీ మధ్య వివాదం మరింత ముదిరింది. ఈసారి మహారాష్ట్ర సీఎం, ఆయన కొడుకును విమర్శించారు. మూవీ మాఫియా, సుశాంత్‌ రాజ్‌పుత్‌ హంతకులు, వారికి చెందిన డ్రగ్‌ రాకెట్‌ ముఠాల గుట్టును తాను బయటపెట్టడం మహారాష్ట్ర సీఎంకు సమస్యగా మారిందని, ఎందుకంటే ఈ మూడింటితో ఆయన కుమారుడు ఆదిత్య  చెట్టాపట్టాలేసుకుంటూ తిరుగుతారని కంగన ధ్వజమెత్తారు. ఈ వ్యవహారాలను బయటపెట్టడమే తాను చేసిన అతిపెద్దనేరమని, అందుకే తనపై కక్షగట్టినట్లు శివసేన ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపించారు.

మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రకాంత్‌ పాటిల్‌ చేసిన ట్వీట్‌కు సంబంధించి వచ్చిన పత్రికా కథనంపై స్పందిస్తూ కంగన ఈ ఆరోపణలు చేశారు. వీరి గుట్టు బయటపెట్టినందుకే తనపై కత్తికట్టారని చెబుతూ ‘‘చూద్దాం! ఎవరి ఆట ఎవరు కట్టిస్తారో?’’ అని ట్విట్టర్‌లో ఘాటుగా స్పందించారు. ఒక మహిళను అవమానించి, భయపెట్టి వారి ఇమేజీని వారే పాడుచేసుకుంటున్నారని దుయ్యబట్టారు. జూన్‌లో నటుడు సుశాంత్‌ ఆత్మహత్య తర్వాత నుంచి ఆమె బాలీవుడ్‌ను తీవ్రంగా విమర్శిస్తూవస్తోంది. సుశాంత్‌ది ఆత్మహత్య కాదని, బయట నుంచి వచ్చిన వాళ్ల ఎదుగుదల చూసి ఓర్వలేని సినీ పరిశ్రమ చేసిన ప్రణాళికాయుత హత్యని ఆమె ఆరోపించారు. (చదవండి: కంగనపై శివసేన ఎమ్మెల్యే తీవ్ర వ్యాఖ్యలు!)

ముంబై వీడిన క్వీన్‌
సోమవారం కంగన ముంబైని వీడి స్వరాష్ట్రం హిమాచల్‌కు చేరుకున్నారు.‘నిరంతర దాడులు, తన ఆఫీస్‌ కూల్చివేత, చుట్టూ బాడీగార్డుల రక్షణ పెట్టుకోవాల్సిరావడం చూస్తే నేను ముంబైని పీఓకేతో పోల్చడం కరెక్టేననిపిస్తోంది’ అని ట్వీట్‌ చేశారు.

కుక్కతోక వంకర!
ముంబైని పీఓకేతో తాను పోల్చడం కరెక్టేనంటూ కంగన చేసిన తాజా వ్యాఖ్యలపై శివసేన ఎంఎల్‌ఏ ప్రతాప్‌ సర్నాయక్‌ మండిపడ్డారు. ఎంత యత్నించినా కుక్కతోక వంకరేనన్న మాటలకర్ధం తెలిసిందని పరోక్షంగా కంగనపై విమర్శలు చేశారు. ముంబై మరీ అంత చెడ్డనగరమనిపిస్తే, పీఓకేలాగా కనిపిస్తే కంగన నగరం వదిలి తనకు సరైన చోటుకు పోవచ్చని శివసేన మంత్రి అనీల్‌ సూచించారు. ముంబై గురించి చెడుగా మాట్లాడితే పార్టీ  చూస్తూ ఊరుకోదని హెచ్చరించారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు