గవర్నర్‌తో కంగన భేటీ

14 Sep, 2020 05:41 IST|Sakshi
ఆదివారం ముంబైలో గవర్నర్‌ బీఎస్‌ కోశ్యారీతో మాట్లాడుతున్న కంగనా రనౌత్‌

తనకు జరిగిన అన్యాయాన్ని వివరించానన్న బాలీవుడ్‌ నటి

ముంబై: అధికార శివసేనను, ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేను తీవ్రంగా విమర్శిస్తున్న బాలీవుడ్‌ నటి కంగన రనౌత్‌ ఆదివారం మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోశ్యారీతో సమావేశమయ్యారు. తనకు జరిగిన అన్యాయాన్ని గవర్నర్‌కు వివరించి, న్యాయం చేయాలని కోరానని ఆ తరువాత ఆమె వెల్లడించారు.  ‘గవర్నర్‌ని కలిశాను. ఒక పౌరురాలిగా ఆయనను కలిసేందుకు వచ్చాను. ఒక కూతురుగా నన్ను చూశారు. నా సమస్య విన్నారు. నాకు రాజకీయాలతో సంబంధం లేదు’ అని గవర్నర్‌తో భేటీ అనంతరం కంగన వ్యాఖ్యానించారు.  సోదరి రంగేలితో కలిసి ఆమె రాజ్‌భవన్‌లో కోశ్యారీని కలిశారు.

ఆ సందర్భంగా గవర్నర్‌కు ఆమె పాదాభివందనం చేశారు. బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ సింగ్‌ అనుమానాస్పద మృతి నేపథ్యంలో ముంబైపై, ముంబై పోలీసులపై కంగన తీవ్ర విమర్శలు చేశారు. ముంబైని పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌తో పోలుస్తూ ఒకసారి, మూవీ మాఫియా కన్నా ముంబై పోలీసులకు  భయపడ్తున్నానని మరోసారి ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై శివసేన  తీవ్రంగా స్పందించింది. ఇది ముంబై పోలీసులను అవమానించడమేనని, ముంబైకి రావద్దని కోరుతున్నామని సేన నేత సంజయ్‌ రౌత్‌ వ్యాఖ్యానించారు. ఈ పరిస్థితుల్లో బాంద్రాలోని కంగన కార్యాలయ భవనాన్ని అక్రమ నిర్మాణమని పేర్కొంటూ బీఎంసీ(బృహన్ముంబై మున్సిపల్‌ కార్పొరేషన్‌) అధికారులు  పాక్షికంగా కూల్చివేశారు. ఆ తరువాత, శివసేనపై, ఉద్ధవ్‌ఠాక్రేపై ఆమె తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.

ముంబైని అవమానించిన వారికి మద్దతా?
ముంబైని పీఓకేతో పోలుస్తూ అవమానించిన కంగనకు బీజేపీ మద్దతిస్తోందని, బిహార్‌ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే బీజేపీ అలా వ్యవహరిస్తోందని శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ విమర్శించారు. ముంబై ప్రాముఖ్యతను దెబ్బతీసి, నగరాన్ని అప్రతిష్టపాలు చేసే కుట్ర జరుగుతోందని సామ్నా పత్రికలోని తన కాలమ్‌ ‘రోక్‌తోక్‌’లో పేర్కొన్నారు. మరాఠా ప్రజలంతా ఏకం కావాల్సిన సమయం ఇదన్నారు. కంగన వ్యాఖ్యలను ఖండిస్తూ మహారాష్ట్రకు చెందిన ఒక్క బీజేపీ నేత కూడా ప్రకటన చేయలేదని గుర్తు చేశారు.  కంగన వ్యాఖ్యలను బాలీవుడ్‌ నటులెవరూ ఖండించకపోవడాన్ని ద్రౌపది వస్త్రాపహరణం సమయంలో మౌనంగా ఉన్న పాండవులతో పోల్చారు. ‘ముంబై వల్ల పేరు, డబ్బు అన్నీ సంపాదించుకున్న మీరు.. అదే ముంబైని సహ నటి విమర్శిస్తే ఖండించరా? డబ్బే ముఖ్యమా?’ అని ప్రశ్నించారు. నటుడు అక్షయ్‌కుమార్‌ మినహా ఎవరూ దీనిపై స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు