మహారాష్ట్ర గవర్నర్‌తో కంగనా భేటీ

13 Sep, 2020 16:26 IST|Sakshi

ముంబై : మహారాష్ట్ర గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోష్యారితో బాలీవుడ్‌ ఫైర్‌బ్రాండ్‌ కంగనా రనౌత్‌ ఆదివారం సాయంత్రం రాజ్‌భవన్‌లో సమావేశమయ్యారు. మహారాష్ట్ర ప్రభుత్వం తన పట్ల అమానుషంగా వ్యవహరించిన తీరును గవర్నర్‌కు వివరించానని, సమాజంలో యువతులు సహా పౌరులందరిలో విశ్వాసం బలపడేలా తనకు న్యాయం జరుగుతుందని గవర్నర్‌తో భేటీ అనంతరం కంగనా వ్యాఖ్యానించారు. తనను గవర్నర్‌ తన సొంత కుమార్తెలా ఆదరించి తన వాదనను ఆసాంతం ఓపిగ్గా విన్నారని చెప్పారు. శివసేన సర్కార్‌తో వివాదం నేపథ్యంలో గవర్నర్‌తో కంగనా భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. ముంబైలో తన కార్యాలయాన్ని బీఎంసీ అధికారులు కూలదోయడంతో పాటు శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ తనపై చేసిన వ్యాఖ్యల గురించి ఈ భేటీలో గవర్నర్‌కు ఆమె వివరించినట్టు తెలిసింది. సెప్టెంబర్‌ 14న ముంబై నుంచి వెనుతిరగనుండటంతో మహారాష్ట్ర ప్రభుత్వం తనను ఇబ్బందులకు గురిచేసిన తీరును గవర్నర్‌ దృష్టికి తీసుకువెళ్లేందుకు ఆమె రాజ్‌భవన్‌కు వెళ్లారు.

కాగా, తనకు బీజేపీ నేతలు మద్దతుగా నిలుస్తున్నారని సంజయ్‌ రౌత్‌ చేసిన వ్యాఖ్యలకూ కంగనా దీటుగా బదులిచ్చారు. శివసేన గూండాలు తనపై హత్యాచారానికి పాల్పడేలా బీజేపీ వ్యవహరించాలా అంటూ కంగనా శివసేన ఎంపీ రౌత్‌ను నిలదీశారు. ఇక ముంబైని పీఓకేతో పోల్చిన నటికి మహారాష్ట్ర ప్రధాన ప్రతిపక్షం (బీజేపీ) మద్దతివ్వడం దురదృష్టకరమని అంతకుముందు శివసేన నేత కాషాయ పార్టీపై ధ్వజమెత్తారు. బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో క్షత్రియులు, రాజ్‌పుత్‌ల ఓట్ల కోసమే బీజేపీ కంగనాకు మద్దతిస్తోందని ఆయన ఆరోపించారు. బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ కేసుపై ముంబై పోలీసుల దర్యాప్తు పట్ల తనకు విశ్వాసం లేదని కంగనా రనౌత్‌ పేర్కొనడంతో వివాదం మొదలైన సంగతి తెలిసిందే. ఇక అప్పటినుంచి ఈ వ్యవహారంపై శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌, బాలీవుడ్‌ క్వీన్‌ కంగనా రనౌత్‌ల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. చదవండి : రనౌత్‌ వర్సెస్‌ రౌత్‌ : బీజేపీని టార్గెట్‌ చేసిన సేన నేత

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా