Kanjhawala Death Case: మానవ మృగాలు.. రెండుసార్లు అంజలిని కాపాడే వీలున్నా..

14 Apr, 2023 15:06 IST|Sakshi

క్రైమ్‌: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ కంజావాలా మృతి కేసులో ఢిల్లీ పోలీసులు ఎట్టకేలకు చార్జ్‌షీట్‌ దాఖలు చేశారు. ఈ కేసులో మొత్తం ఏడుగురు నిందితుల(నలుగురు ప్రధాన నిందితులు) పేర్లను చేరుస్తూ.. 20 ఏళ్ల అంజలి మృతికి కారణమయ్యారంటూ ఢిల్లీ పోలీసులు ఛార్జ్‌షీట్‌లో పొందుపరిచారు. అంతేకాదు ఆమెను కాపాడే వీలున్నా అందుకు కనీస ప్రయత్నం చేయలేదని, పైగా ఆమెను చంపే ఉద్దేశంతోనే కారుతో ఈడ్చుకెళ్లారని పోలీసులు ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. 

ఘటన సమయంలో బాధితురాలు అంజలిని కాపాడే అవకాశాలు రెండుసార్లు కలిగినా కనికరం లేకుండా నిందితులు ముందుకు సాగారని పోలీసులు ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. మొదట.. స్కూటీపై వెళ్తున్న ఆమెను కారుతో ఢీ కొట్టారని, అప్పుడే ఆగి ఆమెను రక్షించే వీలున్నా ఆ ప్రయత్నం చేయలేదని తెలిపారు. రెండు.. ఢీ కొట్టిన తర్వాత ఆమె కారు కింద ఇరుక్కుందని వాళ్లకు తెలుసు. దిగి ఆమెను కాపాడే అవకాశం అప్పటికీ ఉంది. అయినా నిందితులు ఉద్దేశపూర్వకంగానే ఆమెను సుల్తాన్‌పురి నుంచి కంజావాలా మధ్య 12 కిలోమీటర్లపాటు ఈడ్చుకెళ్లారని ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. 

కొత్త సంవత్సరం వేడుకల్లో పాల్గొని ఇంటికి వెళ్తున్న అంజలి, ఆమె స్నేహితురాలిని తొలుత కారుతో ఢీ కొట్టారు నిందితులు. అంజలి కాలు కారు కిందే ఇరుక్కుపోగా.. స్నేహితురాలు కాస్త దూరంలో కింద పడిపోయి భయంతో అక్కడి నుంచి పారిపోయింది. ఆపై అంజలిని కారుతో ఈడ్చుకుంటూ వెళ్లిపోయారు నిందితులు. ఈ క్రమంలో ఆమె ప్రాణం పోతుందని తెలిసినా కూడా నిందితులు ముందుకు సాగడం ఘోరం. ఈ కేసులో నలుగురు నిందితులు అమిత్‌ ఖన్నా, కృష్ణన్‌, మనోజ్‌ మిట్టల్‌, మిథున్‌లపై హత్య నేరాభియోగాలను ఛార్జ్‌షీట్‌లో నమోదు చేశారు పోలీసులు. ఇండియన్‌ పీనల్‌ కోడ్‌ సెక్షన్‌ 302 ప్రకారం వాళ్లపై అభియోగాలు నమోదు అయ్యాయి. 

స్కూటీని ఢీ కొట్టి 500-600 మీటర్ల దూరం వెళ్లాక..  డ్రైవర్‌ పక్క సీట్‌లో ఉన్న నిందితుడు, వెనకాల ఉన్న నిందితుడు ఇద్దరూ.. ఆమె ఇంకా కారు కింద ఉందా? లేదా? అనేది చూశారు. ఉందని నిర్ధారించుకున్న తర్వాత కూడా కారును ముందుకు పోనివ్వాలని డ్రైవర్‌ సీట్‌లో ఉన్న నిందితుడికి సూచించారు. అలా ముందుకు వెళ్లే క్రమంలో.. ఆమె దుస్తులు చినిగిపోయి, వీపు చిట్లిపోయి వెన్నుపూస బయటకు వచ్చేసింది.  పుర్రె భాగం సైతం పగలిపోయింది.  ఈడ్చుకెళ్లే దారిలోనే ఆమె ప్రాణం పోయిందని శవ పరీక్షలో వెల్లడైంది.  

తాము చేస్తున్న పని ఆమెను గాయపర్చడమే కాదు..  ప్రాణాలకు ముప్పు కలిగించేదని తెలిసి కూడా మృగాల్లా నిందితులు వ్యవహరించారని, ఈ కేసులో మద్యం మత్తు అనేది కేవలం తప్పించుకునే సాకుగానే కనిపిస్తోంది తప్ప నిందితులు ఘటన సమయంలో స్పృహలోనే ఉన్నారని, వాళ్లకు ఆ నేర తీవ్రత గురించి కూడా తెలుసని  పోలీసులు ఛార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. ఈ ఛార్జ్‌షీట్‌ ఆధారంగా ఢీల్లీ రోహిణి కోర్టు ఏప్రిల్‌ 18వ తేదీన వాదనలు విననుంది.

మరిన్ని వార్తలు