‘గూగుల్‌ చేసిన పనికి క్షమాపణ చెప్పాల్సిందే’

3 Jun, 2021 20:15 IST|Sakshi

బెంగళూరు: కన్నడ భాషకు సంబంధించి గూగుల్ సెర్చ్ ఫలితాలు నెట్టింట దుమారం రేపుతోందనే చెప్పాలి. ఇటీవల మనకి ఏ సమాచారం కావాలన్నా గూగుల్‌లో సెర్చ్‌ చేయడం అలవాటుగా మారింది. ఈ నేపథ్యంలో భారత్‌లో అత్యంత వికారమైన భాష ఏంటని గూగుల్‌లో సెర్చ్ చేస్తే సమాధానంగా.. భారతదేశంలో వికారమైన భాష ఏమిటి? దీనికి సమాధానం కన్నడ, దక్షిణ భారతదేశంలో సుమారు 40 మిలియన్ల మంది మాట్లాడే భాషని చూపించింది. దీనిపై కన్నడ ప్రజలు, రాజకీయ ప్రతినిధులు కూడా గూగుల్‌ నిర్వాకంపై మండిపడుతున్నారు.  ప్రస్తుతం ఈ వ్యవహారం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

 దీని పై బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గ ఎంపీ పీసి మోహన్ తన ట్విటర్‌ ద్వారా స్పందించారు. ఆయన తన ట్వీట్‌లో.. విజయనగర సామ్రాజ్యానికి నిలయం, విలువైన వారసత్వ సంపద కన్నడ భాష. కన్నడ భాషకు ప్రత్యేకమైన సంస్కృతి ఉంది. ప్రపంచంలో ఉన్న అతిపురాతన భాషల్లో కన్నడ కూడా ఒకటని తెలిపారు. 14 శాతాబ్దంలో జాఫ్రీ చౌసెర్ పుట్టకముందే కన్నడలో పురాణాలు ఉన్నాయన్నారు. అయినా ఇలా ఓ భాషను అవమానించడం గూగుల్‌ లాంటి ప్రముఖ సంస్థకు తగదని సూచించారు. ఇందుకు తక్షణమే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక సోషల్‌ మీడియాలో నెటిజన్లు ఈ అంశంపై ఘాటుగా స్పందిస్తున్నారు.  కన్నడ కంటే మంచి భాషా ఎదో చెప్పాలని అని ఒకరు ప్రశ్నించగా.. మరికొందరు గూగుల్‌ను భారత్‌లో బ్యాన్ చెయ్యాలంటూ డిమాండ్ చేస్తున్నారు.

చదవండి: అక్కడ 295 గ్రామాల్లో కరోనా కేసులు లేవు.. ఇదే కారణమట

మరిన్ని వార్తలు