బీజేపీలో చేరికా?.. చచ్చినట్లే లెక్క!

10 Jun, 2021 15:51 IST|Sakshi

న్యూఢిల్లీ: రాహుల్ గాంధీకి అత్యంత ఆప్తుడైన జితిన్​ ప్రసాద,​ బీజేపీలో చేరడంతో కాంగ్రెస్​ నాయకత్వ సంక్షోభం మళ్లీ తెర మీదకు వచ్చింది. పార్టీ నుంచి మరిన్ని వలసలు ఉండొచ్చనే చర్చల నడుమ.. మరికొందరు కాంగ్రెస్​ సీనియర్​ నేతల పేర్లు తెరపైకి వస్తున్నాయి. ఇంకోవైపు పార్టీలో సమూలమైన మార్పులు చేయాల్సిందేనని సోనియా గాంధీకి జీ-23 అసమ్మతి నేతలు గతంలోనే లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో తాజా రాజకీయ పరిణామాలపై కాంగ్రెస్​ సీనియర్​ నేత కపిల్​ సిబాల్ తీవ్రంగా స్పందించారు.

కాంగ్రెస్​ పార్టీతోనే తాము ఉంటామని, ఒకవేళ అక్కర్లేదు వెళ్లిపొమ్మని పార్టీ చెప్తే.. వెళ్లిపోతామని ఆయన స్పష్టం చేశారు. అయితే ఎట్టి పరిస్థితుల్లో బీజేపీలో మాత్రం చేరబోనని, తాను పుట్టినప్పటి నుంచి ఆ పార్టీకి వ్యతిరేకమని కపిల్ సిబాల్​ పేర్కొన్నారు. ‘‘బీజేపీలో చేరడమంటే నేను చచ్చిపోయినట్లే లెక్క’ అని ఘాటుగా వ్యాఖ్యానించారాయన. ఇక బీజేపీలో జితిన్ ప్రసాద చేరికపైనా సిబాల్​ స్పందించారు. అది 'ప్రసాద రామ' రాజకీయాలు. సిద్ధాంతాలను పక్కనబెట్టి కేవలం స్వార్థ ప్రయోజనాల కోసమే పార్టీని వీడారని మండిపడ్డారు. అయితే ఇప్పుడు నడుస్తున్న రాజకీయాలకు ఓ సిద్ధాంతమంటూ లేకుండాపోయిందని ఆయన బాధపడ్డారు. ఇక పార్టీని వీడడంలో జితిన్ కారణాలు.. జితిన్​ ఉండొచ్చని, అయితే పార్టీని వీడినందుకు కాకుండా.. వీడేందుకు జతిన్​ చెప్పిన కారణాలనే విమర్శించాలని కాంగ్రెస్​ నేతలకు ఆయన హితవు పలికారు.

కాంగ్రెస్​కూ అల్టిమేటం
పార్టీ తమ వాదన వినడంలో విఫలమైతే తామంతా విఫలమైనట్లేనని సిబాల్​ వ్యాఖ్యానించారు. పార్టీలో సంస్కరణలకు సమయం ఆసన్నమైందని, సీనియర్ల మాటల్ని నాయకత్వం ఇకనైనా వినాలని కపిల్ సిబల్ విజ్ఞప్తి చేశారు. పార్టీలోని సమస్యలు ఇంకా పరిష్కారం కాలేదు. అది నిజం. అవి పరిష్కారం అయ్యే వరకు వేలేత్తి చూపుతూనే ఉంటాం. నాయకత్వం విఫలమైతే పార్టీ నేతలందరూ విఫలమైనట్లే అని కపిల్ వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా అధిష్ఠానం మేల్కోవాలని, నష్ట నివారణ చర్యలు చేపట్టాలని లేకుంటే పార్టీ తీవ్ర సంక్షోభానికి గురవుతుందని  కపిల్​ తేల్చి చెప్పారు. చదవండి: కాంగ్రెస్​ తీరు  మారినట్లేనా?

మరిన్ని వార్తలు