చేతిలో పసికందుతో సాహసం.. కానిస్టేబుల్‌కు ప్రమోషన్‌

5 Apr, 2022 08:49 IST|Sakshi

మంటల్లో చిక్కుకున్న చోటు నుంచి ఓ పసికందును.. సురక్షితంగా బయటకు తీసుకొచ్చిన కానిస్టేబుల్‌ సాహసం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న విషయం తెలిసిందే. 

రాజస్థాన్‌ కరౌలీలో శనివారం మత ఘర్షణలు చెలరేగాయి. ఆ టైంలో పోలీస్‌ కానిస్టేబుల్‌ నేత్రేష్‌ శర్మ Netresh Sharma చేసిన సాహసంపై సర్వత్రా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. కొత్త సంవత్సరం రోజు ర్యాలీ సందర్భంగా.. కొందరు రాళ్లు రువ్వడంతో ఘర్షణ మొదలైంది. ఆ టైంలో అక్కడే విధులు నిర్వహిస్తున్న నేత్రేష్‌ గాయపడ్డ వాళ్లకు సాయం చేశాడు. ఇద్దరిని ఆస్పత్రికి తరలించాడు. అంతేకాదు నిప్పు అంటుకున్న రెండు షాపుల మధ్య ఇంటి నుంచి మహిళను, ఆమె చంటి బిడ్డను నేత్రేష్‌ ఆదుకోవడం ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్‌ అయ్యింది. 

ఈ ఘటనపై మీడియాతో మాట్లాడిన ఈ రియల్‌ హీరో సింపుల్‌గా ‘అది నా బాధ్యత’ అంటూ చెప్పాడు. అయితే తమ కానిస్టేబుల్‌ తెగువను రాజస్థాన్‌ పోలీస్‌ శాఖ మాత్రం గర్వంగా భావిస్తోంది. మరోవైపు ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ దృష్టికి ఈ విషయం వెల్లడంతో స్వయంగా నేత్రేష్‌కి ఫోన్‌ చేసి మాట్లాడారు. అంతేకాదు.. కానిస్టేబుల్‌గా ఉన్న నేత్రేష్‌ను హెడ్‌కానిస్టేబుల్‌గా ప్రమోట్‌ చేస్తున్నట్లు ప్రకటించారు. 

ఘర్షణలు చెలరేగిన వెంటనే.. ఇంటర్నెట్‌పై పరిమిత ఆంక్షలు, 144 సెక్షన్‌ విధించిన పోలీసులు చాకచక్యంగా పరిస్థితిని అదుపు చేయగలిగారు.  ఇక ఘర్షణలకు సంబంధించి 46 మందిని అరెస్ట్‌ చేసిన పోలీసులు.. రాళ్లు రువ్విన ఘటనకు సంబంధించి ఏడుగురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం తరపున ముగ్గురు  సభ్యుల కమిటీ ఒకటి ఘర్షణలకు సంబంధించి నిజనిర్ధారణ చేపట్టేందుకు సిద్ధమైంది. ఇందులో ఎమ్మెల్యేలు జితేంద్ర సింగ్‌, రఫిక్‌ ఖాన్‌లు ఉన్నారు. ​

మరిన్ని వార్తలు