కార్గిల్‌ హీరో లవ్‌స్టోరీ: వేలు కోసుకుని ఆమెకు బొట్టుపెట్టాడు

26 Jul, 2021 11:49 IST|Sakshi

Vikram Batra Love Story: కార్గిల్‌ యుద్ధంలో భారత్‌.. దాయాది దేశం పాకిస్తాన్‌పై విజయం సాధించి నేటితో 22 ఏళ్లు. దాదాపు మూడు నెలల పాటు సాగిన ఈ యుద్ధంలో 527 మంది భారత సైనికులు వీరమరణం పొందగా.. 1300 మంది గాయపడ్డారు. వీరమరణం పొందిన వారిలో కెప్టెన్‌ విక్రమ్‌ బత్రా ఒకరు. యుద్ధ భూమిలో వెన్ను చూపని వీరుడిగానే కాదు..  ప్రేమికుడిగా కూడా ఆయన చిరస్మరణీయుడే. డింపుల్‌ చీమాతో ఆయన ప్రేమ ప్రయాణం పెళ్లి తీరం చేరకుండానే ముగిసింది. అయినప్పటికి అన్ని అమర ప్రేమల్లాగే వీరి ప్రేమ కూడా అజారమరం.

ప్రేమ - యుద్ధం 
విక్రం- డింపుల్‌లు 1995లో మాస్టర్స్‌ డిగ్రీ చదవటానికి పంజాబ్‌ యూనివర్శిటీలో చేరారు. ఆ సమయంలోనే ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. కాలేజీలోని అన్ని ప్రేమ జంటల్లానే ప్రేమ లోకంలో విహరించింది వీరి జంట. అయితే, 1996లో విక్రం డెహ్రాడూన్‌లోని ఇండియన్‌ మిలిటరీ అకాడమీకి ఎంపిక అవటంతో మాస్టర్స్‌ డిగ్రీని మధ్యలోనే ఆపేశాడు. ఆ తర్వాత డింపుల్‌ కూడా చదువుకు స్వప్తి పలికింది. విక్రం ఆర్మీలో ఉన్నా వీరి ప్రేమ అలానే కొనసాగింది. అతడు డెహ్రాడూన్‌నుంచి ఇంటికి వచ్చిన ప్రతిసారి డింపుల్‌ను కలిసేవాడు. 

అప్పుడు ఇద్దరూ గురుద్వారాలోని మానసా దేవి ఆలయానికి వెళ్లేవారు. అక్కడ ఓ రోజు గుడి చుట్టూ ఇద్దరూ కలిసి ప్రదిక్షణ చేసిన తర్వాత ‘‘ శుభాకాంక్షలు మిసెస్‌ బత్రా. నువ్వు గమనించలేదా మనం ఇలా ప్రదిక్షణ చేయటం ఇది నాలుగో సారి’’ అని అన్నాడు విక్రం. అది విన్న డింపుల్‌ మాటల్లేని దానిలా నిలబడి పోయింది. విక్రం తమ బంధానికి ఎంత విలువ ఇస్తున్నాడో తెలిసి చాలా సంతోషించింది. ఓ రోజు ఇద్దరూ మానసా దేవి ఆలయంలో ఉండగా పెళ్లి ప్రస్తావన తెచ్చింది డింపుల్‌. అప్పుడు విక్రం తన వ్యాలెట్‌లోంచి బ్లేడ్‌ తీసి తన బొటన వేలు కోసుకున్నాడు. ఆ రక్తంతో ఆమె నుదిటిన బొట్టుపెట్టాడు. సినిమా స్లైల్లో జరిగిన ఈ సంఘటన ఆమె మనసులో చెరగని ముద్రవేసుకుంది.

షేర్‌షా చిత్రంలోని ఓ దృశ్యం

సంవత్సరాలు గడుస్తున్న కొద్ది డింపుల్‌ ఇంట్లో పెళ్లి చేసుకోమని ఒత్తిడి పెరగసాగింది. ఈ నేపథ్యంలో  కార్గిల్‌ యుద్ధం ముగిసిన తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. 1999 జులై 7న కార్గిల్‌ యుద్ధంలో విక్రం వీరమరణం పొందాడు. కేంద్ర ప్రభుత్వం ఆయనను పరమ్‌ వీర చక్రతో గౌరవించింది.  విక్రం మరణం తర్వాత డింపుల్‌ మళ్లీ పెళ్లి చేసుకోలేదు. విక్రం జీవిత కథను బాలీవుడ్‌లో ‘‘షేర్‌షా’’ సినిమాగా తెరకెక్కించారు. సిద్ధార్థ్‌ మల్హోత్రా, కియారా అద్వానీ జంటగా నటించిన ఈ చిత్రం వచ్చే నెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు