Vikram Batra Birth Anniversary: కార్గిల్‌ అమరవీరుడు.. రియల్‌ ‘షేర్షా’ గురించి ఈ విషయాలు తెలుసా?

9 Sep, 2021 13:53 IST|Sakshi

నాయకుడంటే.. ఏదో ముందుండి నడిపిస్తున్నాడనే పేరుంటే సరిపోదు. లక్ష్యసాధనలో తన వెనకున్న వాళ్లకు సరైన దిశానిర్దేశం చేయాలి. విజయం కోసం అహర్నిశలు కృషి చేయాలి. అవసరమైతే తెగువను ప్రదర్శించాలి.. త్యాగానికి సిద్ధపడాలి. ఇది మిగతా వాళ్ల గుండెల్లో ధైర్యం నింపుతుంది. గెలుపు కోసం చివరిదాకా పోరాడాలనే స్ఫూర్తిని కలగజేస్తుంది. కార్గిల్‌ వార్‌లో అసువులు బాసిన వీరులెందరో. అందులో కెప్టెన్‌ విక్రమ్‌ బాత్రా ప్రముఖంగా వినిపిస్తుంటుంది. కారణం.. పైన చెప్పిన లక్షణాలన్నీ ఆయన ప్రతిబింబించారు కాబట్టి. అన్నట్లు ఇవాళ ఈ కార్గిల్‌ అమరవీరుడి జయంతి. ఈ సందర్భంగా ఆ రియల్‌ హీరోను స్మరించుకుంటూ... 


హిమాచల్‌ ప్రదేశ్‌ పాలంపూర్‌ జిల్లా ఘుగ్గర్‌ గ్రామంలో 1974 సెప్టెంబర్‌ 9న మిడిల్‌ క్లాస్‌ ఫ్యామిలీలో జన్మించారు. 
చదవులోనే కాదు.. ఆటపాటల్లోనూ రాణిస్తూ ఆల్‌రౌండర్‌గా పేరు సంపాదించుకున్నారు.

విక్రమ్‌ బాత్రా చిన్నప్పటి నుంచే ధైర్యశాలి. కరాటేలో గ్రీన్‌ బెల్ట్‌ హోల్డర్‌. టేబుల్‌ టెన్నిస్‌ నేషనల్‌ లెవల్‌లో ఆడారు. 
నార్త్‌ ఇండియా ఎన్‌సీసీ కాడెట్‌(ఎయిర్‌ వింగ్‌) నుంచి ఉత్తమ ప్రదర్శన అవార్డు సైతం అందుకున్నారు
డిగ్రీ అయిపోగానే కంబైన్డ్‌ డిఫెన్స్‌ సర్వీసెస్‌ ఎగ్జామ్‌ల కోసం ప్రిపేర్‌ అయ్యారు.
 
1996లో ఆయన కల నెరవేరింది. ఇండియన్‌ మిలిటరీ ఆకాడమీలో చేరారు. 
విక్రమ్‌ బాత్రా.. మన్నెక్‌షా బెటాలియన్‌కి చెందిన జెస్సోర్‌ కంపెనీ(డెహ్రాడూన్‌)లో చేరి, ఆపై లెఫ్టినెంట్‌గా, అటుపై కెప్టెన్‌ హోదాలో కార్గిల్‌ హోదాలో అడుగుపెట్టారు. 
డేరింగ్‌ అండ్‌ డాషింగ్‌ ఆటిట్యూడ్‌ ఉన్న విక్రమ్‌ను తోటి సభ్యులుగా ముద్దుగా షేర్షా అని పిల్చుకునేవాళ్లు

గాంభీర్యంగా పైకి కనిపించే బాత్రా చాలా సరదా మనిషి. ఆయన చిరునవ్వే ఆయనకు అందమని చుట్టుపక్కల వాళ్లు చెప్తుంటారు
ఆయన నోటి నుంచి ఓ ఇంటర్వ్యూలో వచ్చిన ‘యే దిల్‌ మాంగే మోర్‌’ డైలాగ్‌.. తర్వాతి కాలంలో పెద్ద బ్రాండ్‌కి ప్రచార గేయం అయ్యిందని చెప్తుంటారు కొందరు. అందులో నిజమెంతో గానీ.. ఆయన నుంచి మాత్రం ఆ మాట వచ్చిన విషయం వాస్తవం.

  
కార్గిల్‌ వార్‌లో వేల అడుగుల ఎత్తున శత్రువులు సైతం ఊహించని మెరుపుదాడికి సిద్ధమయ్యారు
 దాడిలో తీవ్రంగా గాయపడ్డా కూడా శత్రువులకు వెన్నుచూపెట్టలేదు ఆయన.  ముగ్గురు శత్రువుల్ని మట్టుబెట్టిన మరీ 24  ఏళ్లకు దేశం కోసం వీరమరణం పొందారు. ఆ పోరాటం మిగతా వాళ్లలో స్ఫూర్తిని విజయ బావుటా ఎగరేయించింది.

 
మరణాంతరం పరమ వీర చక్రతో పాటు రియల్‌ హీరోల జాబితాలో చోటుసంపాదించుకుని యావత్‌ దేశం నుంచి గౌరవం అందుకున్నారాయన.  
డిగ్రీ టైంలో డింపుల్‌ ఛీమాతో నడిచిన ప్రేమ కథ.. విక్రమ్‌ వీరమరణంతో పెళ్లి పీటలు ఎక్కకుండానే విషాదంగా ముగిసింది. అంతా బలవంతం పెట్టినా  విక్రమ్‌ జ్ఞాపకాలతో ఉండిపోవాలనుకుని ఆమె వివాహం చేసుకోలేదు. ‘రక్త్‌ సింధూర్‌’ ప్రేమ కథగా విక్రమ్‌-డింపుల్‌ కథ చరిత్రలో నిలిచిపోయింది. విక్రమ్‌ పుట్టినరోజు, మరణించిన రోజు డింపుల్‌ తప్పకుండా విక్రమ్‌ ఇంటికి వెళ్లి.. ఆయన పేరెంట్స్‌తో కాసేపు గడుపుతుంటుంది కూడా.

 
రీసెంట్‌గా సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా వచ్చిన షేర్షా.. ఈయన జీవిత కథ ఆధారంగానే తీసింది. ఇందులో డింపుల్‌ పాత్రను కియారా అద్వానీ పోషించింది.

- సాక్షి, స్పెషల్‌ డెస్క్‌

మరిన్ని వార్తలు