డబుల్‌ డోస్‌ వ్యాక్సిన్‌.. అయినా 66 మందికి సోకిన కరోనా!

25 Nov, 2021 16:42 IST|Sakshi
ఎస్‌డీఎం కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో వైద్య సిబ్బంది, అధికారులు

బెంగళూరు: కరోనా ముప్పు ఇప్పట్లో తొలగేలా కనిపించడం లేదు. వ్యాక్సిన్లు వేయించుకున్న వారు కూడా కోవిడ్‌ బారిన పడుతున్నారు. తాజాగా కర్ణాటకలోని ధార్వాడ్‌లో దాదాపు 66 మంది వైద్య విద్యార్థులకు కరోనా సోకింది. టీకాలు వేయించుకున్నప్పటికీ వీరికి కోవిడ్‌ సోకడం ఆందోళన కలిగిస్తోంది. ఎస్‌డీఎం కాలేజ్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ఇటీవల ఫ్రెషర్స్ పార్టీ జరిగింది. దీని తర్వాత 300 మంది మొదటి సంవత్సరం విద్యార్థులకు కరోనా పరీక్షలు నిర్వహించగా 66 మందికి పాజిటివ్‌గా నిర్ధారణయింది. 

జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి, డిప్యూటీ కమిషనర్‌ ఆదేశాల మేరకు కళాశాలలోని రెండు హాస్టళ్లను ముందుజాగ్రత్త చర్యగా మూసివేశారు. ప్రస్తుతం ఫిజికల్ క్లాసులు నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోస్‌లు వేసుకున్నప్పటికీ విద్యార్థులు కరోనా బారిన పడ్డారని, వారికి హాస్టల్‌లోనే చికిత్స చేయిస్తామని ధార్వాడ్ డిప్యూటీ కమిషనర్ నితీష్ పాటిల్ తెలిపారు. ‘ముందు జాగ్రత్తగా విద్యార్థులను క్వారంటైన్‌ చేసి, రెండు హాస్టళ్లను మూసివేశాము. విద్యార్థులకు వైద్యం, ఆహారం అందిస్తాం. హాస్టళ్ల నుంచి వారిని ఎవరూ బయటకు రానివ్వరు. పరీక్షల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులను కూడా ఇదే ప్రాంగణంలో ఉంచుతాం. బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంద’ని నితీష్ పాటిల్ చెప్పారు. (చదవండి: సీఎం ఆఫీసులో కరోనా కలకలం)

ఫ్రెషర్స్ పార్టీ కారణంగా విద్యార్థులకు వ్యాధి సోకినట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ‘విద్యార్థులు కళాశాల నుంచి బయటకు వెళ్లారా లేదా అనే విషయాన్ని పరిశీలిస్తున్నాం. ఫ్రెషర్స్ పార్టీలో పాల్గొన్న విద్యార్థులందరికీ కరోనా నిర్ధారిత పరీక్షలు చేయించాం. వీరిని కలిసిన వారిని గుర్తించి పరీక్షలు నిర్వహిస్తాం. విద్యార్థులందరూ రెండు డోసుల టీకాలు తీసుకున్నార’ని నితీష్ పాటిల్ వెల్లడించారు. కాగా, వ్యాధి సోకిన కొంతమంది విద్యార్థులకు దగ్గు, జ్వరం ఉండగా మరికొందరికి ప్రస్తుతం ఎలాంటి లక్షణాలు లేవన్నారు. (చదవండి: డ్రైనేజీ పైపులో నోట్ల కట్టలు, నగలు.. అవాక్కయిన ఏసీబీ అధికారులు)

మరిన్ని వార్తలు