డ్రగ్‌ ట్రాఫికింగ్‌ దర్యాప్తు.. సంచలన విషయాలు వెల్లడి

27 Aug, 2020 10:17 IST|Sakshi

బెంగళూరు:  వారం రోజుల క్రితం కర్ణాటకలో వెలుగు చూసిన మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసు దర్యాప్తులో భాగంగా కొందరు ‘ప్రముఖ సంగీతకారులు, నటులు’ ప్రస్తుతం నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. వివరాలు.. ఆగస్టు 21న ఎన్‌సీబీ బృందం.. బెంగళూరు కల్యాణ్ నగర్‌లోని రాయల్ సూట్స్ హోటల్ అపార్ట్‌మెంట్ నుంచి 145 ఎండీఎంఏ మాత్రలు, 2.20 లక్షల రూపాయలకు పైగా నగదును స్వాధీనం చేసుకుంది. ఆ తరువాతి చర్యల్లో భాగంగా ఈ బృందం బెంగళూరులోని నికూ అపార్ట్‌మెంట్‌లో మరో 96 మాత్రలు, 180 ఎల్ఎస్‌డీ బ్లాట్లను స్వాధీనం చేసుకున్నట్లు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో డిప్యూటీ డైరెక్టర్ (ఆపరేషన్స్) కె పి ఎస్ మల్హోత్రా ఒక ప్రకటనలో తెలిపారు. అంతేకాక ‘ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న ఒక లేడీ డ్రగ్ సప్లయర్‌ని అదుపులోకి తీసుకోవడమే కాక బెంగళూరు దోడగుబ్బీలోని ఆమె ఇంటి నుంచి 270 ఎండీఎంఏ మాత్రలు స్వాధీనం చేసుకున్నాము’ అని మల్హోత్ర తెలిపారు. (చదవండి: రూ. 100 కోట్ల డ్రగ్స్‌ పట్టివేత!)

ఈ దాడుల సమయంలో ఎం అనూప్, ఆర్ రవీంద్రన్, అనిఖా డి అనే ముగ్గురిని అరెస్టు చేసినట్లు మల్హోత్ర తెలిపారు. ప్రముఖ సంగీతకారులు, నటులతో పాటు కళాశాల విద్యార్థులు, యువకులకు సహా సమాజంలోని సంపన్న వర్గాలకు చెందిన వారికి.. నిందితులు మాదకద్రవ్యాలను సరఫరా చేస్తున్నారని ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు మల్హోత్ర. ఈ కేసులో ఎన్‌సీబీ బెంగళూరు యూనిట్ త్వరలోనే మరికొందరిని అరెస్టు చేసే అవకాశం ఉందని ఆయన అన్నారు. ఫెడరల్ యాంటీ-నార్కోటిక్స్ ఏజెన్సీ, ఈ నెల ప్రారంభంలో మాదకద్రవ్యాల వ్యవహారంలో రెహమాన్.కె అనే వ్యక్తిని అరెస్టు చేసింది. అతడు కళాశాల విద్యార్థులు, యువకులకు ఎండీఎంఏతో పాటు ఇతర డ్రగ్స్‌ని విక్రయిస్తున్నాడని ఎన్‌సీబీ తెలిపింది. వినియోగదారులు బిట్‌ కాయిన్స్‌ ద్యారా ఆన్‌లైన్‌లో ఈ మాత్రలను కొనుగోలు చేసినట్లు గుర్తించామని.. కొద్ది రోజుల కిందట ఇదే తరహా మాత్రలను కొనుగోలు చేసిన జంటను ముంబాయిలో పట్టుకున్నామని మల్హోత్ర తెలిపారు. 

మరిన్ని వార్తలు