Karnataka: ఏఎస్‌ఐ వర్సెస్‌ మాజీ స్పీకర్‌: ఆడియో క్లిప్‌ వైరల్‌

30 Aug, 2021 07:28 IST|Sakshi

సాక్షి, బెంగళూరు/బనశంకరి: కాంగ్రెస్‌ సీనియర్‌ ఎమ్మెల్యే, మాజీ స్పీకర్‌ రమేశ్‌కుమార్‌పై బెంగళూరు జేపీ నగర పోలీస్‌స్టేషన్‌లో పనిచేసే గోపి అనే ఏఎస్‌ఐ మండిపడ్డారు. ఆదివారం గోపి మాట్లాడిన ఆడియో క్లిప్‌ వైరల్‌ అయింది. ‘‘మాజీ సభాధ్యక్షునికి మొదటి నుంచీ గౌరవం ఇస్తున్నాం. కానీ ఆయన అందరు రాజకీయనేతల కంటే భిన్నంగా ఉంటారు. ప్రవర్తన సరిగాలేదు’’ అని ఆడియో క్లిప్‌లో విమర్శలు చేశాడు.

‘‘ఇతను (రమేశ్‌కుమార్‌) రోడ్డులో వెళుతుండగా ఏదైనా ప్రమాదం సంభవిస్తే ఏమి చెబుతారంటే రహదారుల్లో సక్రమంగా వాహనాలు తనిఖీలు చేయడం లేదంటారు. మా కుటుంబాల గురించి మాట్లాడతారు. మేం ఇతని కుటుంబం గురించి మాట్లాడామా? మా విధుల గురించి మాట్లాడాలి. ఇతనిపై ఉన్న గౌరవం కూడా పోయింది’’ అని ఏఎస్‌ఐ అన్నారు. తనిఖీలు చేయడం మీ భార్యపిల్లలకు మంచిది కాదని ఆయన చెప్పడం ఎంతవరకు సమంజసం అని మాజీ స్పీకర్‌పై మండిపడ్డారు.  

వివాదం ఎక్కడ మొదలైంది  
రోడ్డుపై వాహనాలను నిలిపి జరిమానా విధిస్తున్న చింతామణి పట్టణ పోలీసులను ఎమ్మెల్యే రమేశ్‌కుమార్‌ మందలించారు. ఇది వివాదానికి దారితీసింది. కాగా శుక్రవారం, ఎస్‌ఐ ముక్తియార్‌ సిబ్బందితో తాలూకాలోని మడికెరి క్రాస్‌లో వాహనాలను అడ్డుకుని జరిమానా విధిస్తున్నారు. ఈ సమయంలో శ్రీనివాసపుర నుంచి బెంగళూరుకు వెళుతున్న రమేశ్‌కుమార్‌ తన వాహనాన్ని నిలిపి.. ‘‘పోలీసులను పిలిచి రోడ్ల మధ్యలో వాహనాలను నిలిపి జరిమానా విధించరాదని ఇటీవల హోంమంత్రి ఆదేశాలు జారీచేశారు కదా.

మీరు  ఎందుకు ఇలా చేస్తున్నారు, ఇది మీ కుటుంబానికి మంచిదికాదు. ఏం డాక్యుమెంట్లను చెక్‌ చేస్తారు? సిగ్గుండాలి మీకు. హోంమంత్రి చెప్పినా వినిపించుకోరా?, ఇదే మీ ఉద్యోగమా మీకు’’ అని ఘాటుగా ప్రశ్నించారు. ఈ వీడియోలు వైరల్‌ అయ్యాయి. ఏఎస్‌ఐ ఆడియోపై రమేశ్‌కుమార్‌ స్పందిస్తూ టోల్‌గేట్‌ వద్ద పోలీసుల ప్రవర్తన బాధ కలిగించడంతో మీకు పిల్లలు లేరా? వెళ్లండి అని అన్నాను అని చెప్పారు. ఈ వివాదంపై పోలీసు ఉన్నతాధికారులు ఎలా స్పందిస్తారో చూడాలి మరి! 

చదవండి: Karnataka: రూపాయికే రొట్టె, అన్నం, సాంబార్‌ 

మరిన్ని వార్తలు