Karnataka Assembly elections 2023: బీజేపీ కోటలో కాంగ్రెస్‌ పాగా వేసేనా?

7 May, 2023 05:18 IST|Sakshi

కరావళి కర్ణాటకలో హోరాహోరీ పోరు

కుల, మత రాజకీయాలే అధికం

హిజాబ్, హలాల్‌ అంశాలే కీలకం

సాక్షి బెంగళూరు: ఎంతో వైవిధ్యం, సాంస్కృతిక, సామాజిక, వారసత్వ సంపద కలిగిన ప్రాంతం కరావళి కర్ణాటక. సుదీర్ఘ తీరప్రాంతం, అటవీ భూభాగం కలిగిన ఈ ప్రాంతాన్ని బీజేపీ తన అడ్డాగా మార్చుకుంది. ఎన్నో ఏళ్లుగా ఈ ప్రాంతంలో బీజేపీ ఆధిక్యతను ప్రదర్శిస్తోంది. కరావళి కర్ణాటక పరిధిలోకి వచ్చే దక్షిణ కన్నడ, ఉడుపి జిల్లాల్లో గత ఎన్నికల్లో బీజేపీ తిరుగులేని పార్టీగా అవతరించింది. గతంలో ఉత్తర కన్నడ జిల్లా కరావళి కర్ణాటక పరిధిలో ఉన్నప్పటికీ ఆ తర్వాత దాన్ని కిత్తూరు కర్ణాటకలో కలిపేశారు.

అలాగే కొడుగు జిల్లా దక్షిణ కర్ణాటక ప్రాంతంలో కలిసిపోయింది. ప్రస్తుతం ఉడుపి, దక్షిణ కన్నడ జిల్లాలను కరావళి కర్ణాటకగా పిలుస్తున్నారు. ఈ ప్రాంతంలో నియోజకవర్గాల అభివృద్ధి కంటే వ్యక్తిగత కీర్తి, కుల ఆధారిత రాజకీయాలు కీలకంగా ఉన్నాయి. ఈ రెండు జిల్లాల్లో మొత్తం 13 నియోజకవర్గాలు ఉన్నాయి. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ 13 స్థానాల్లో బీజేపీ 12 చోట్ల గెలుపొందింది. బీజేపీకి కంచుకోటలో పాగా వేయా లని ప్రతిపక్ష కాంగ్రెస్‌ పార్టీ ప్రయత్నిస్తోంది. జేడీఎస్‌ ఈ ప్రాంతంలో ఖాతా కూడా తెరవలేకపోయింది.

హిజాబ్‌ ప్రభావం చూపిస్తుందా?
కుల, మత ప్రాతిపదికన అంశాలు ఇక్కడ రాజకీయాలను శాసిస్తున్నాయి. హిజాబ్, హలాల్‌  వివాదాలు ఈ ఎన్నికలను ప్రభావితం చేసే అవకాశం ఉంది.  రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే  కరావళి కర్ణాటకలో అత్యధికంగా ఆరుగురు సీనియర్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు ఈసారి బీజేపీ టికెట్‌ ఇవ్వలేదు. కోస్తా కర్ణాటకలో పార్టీ బలాన్ని చూసుకుని టికెట్ల పంపిణీలో సాహసోపేత నిర్ణయం తీసుకుంది. ఈ ప్రాంతంలో సరస్వత్‌ బ్రాహ్మిణ్‌లు, మత్స్యకార సామాజికవర్గం మొగవీరలు ఎక్కువగా ఉన్నారు.

వీరంతా ప్రస్తుతం బీజేపీకే మద్దతుగా నిలుస్తున్నారు. ఈ ప్రాంతంలోని ఉడుపి జిల్లా కార్కళ నియోజకవర్గం నుంచి శ్రీరామ సేన అధ్యక్షుడు ప్రమోద్‌ ముతాలిక్‌ ఈ సారి ప్రత్యక్ష ఎన్నికల్లో నిలవడం గమనార్హం. దీంతో కార్కళలో హిందూ సామాజికవర్గ ఓట్లు బీజేపీకి, ముతాలిక్‌ మధ్య చీలిక తెచ్చే అవకాశం ఉంది. విద్యా సంస్థల్లో హిజాబ్‌ నిషేధం, హలాల్‌ మాంసం నిషేధించి జట్కా మాంసంపై బీజేపీ ప్రచారం చేస్తుండడంతో ముస్లింలలో ఆగ్రహం పెరిగిపోతోంది.

ఈ ప్రాంతంలో బలంగా ఉన్న  పీఎఫ్‌ఐ సంస్థను నిషేధించడంతో ఆ ప్రతినిధులు బీజేపీ సర్కారుకు వ్యతిరేకంగా పని చేస్తున్నారు. మరోవైపు పోటాపోటీ హత్యలు, హింసాత్మక ప్రేరేపణలు, దాడుల నేపథ్యంలో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. ఇవన్నీ తనకు అనుకూలంగా మార్చుకోవడానికి కాంగ్రెస్‌ పన్నుతున్న వ్యూహాలు ఫలిస్తాయో లేదో వేచి చూడాలి.

మరిన్ని వార్తలు