Karnataka Assembly elections 2023: ‘గరీబీ హఠావో’ అతిపెద్ద కుంభకోణం

7 May, 2023 06:08 IST|Sakshi

కాంగ్రెస్‌ హామీలపై ప్రధాని మోదీ నిప్పులు

బెంగళూరు నగరంలో భారీ రోడ్‌ షో

శివాజీనగర: కాంగ్రెస్‌ పార్టీ ఇస్తున్న హామీలపై అప్రమత్తంగా ఉండాలని ప్రధాని మోదీ ప్రజలను హెచ్చరించారు. శనివారం కర్ణాటకలోని బెంగళూరు, బాగల్‌కోటె, బాదామిల్లో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో ప్రధాని మాట్లాడారు. 50 ఏళ్ల క్రితం కాంగ్రెస్‌ ఇచ్చిన గరీబీ హఠావో హామీ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణమని పేర్కొన్నారు. ఈ ఒక్క పథకంతోనే కాంగ్రెస్‌ దేశవ్యాప్త ఎన్నికల్లో ప్రచారం చేసింది. ఈ కుంభకోణం నేటికీ కొనసాగుతూనే ఉందన్నారు.

‘కాంగ్రెస్‌ అబద్ధాలు, వేధింపులపై కర్ణాటకలోని అన్ని వర్గాల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. కాంగ్రెస్‌ నిషేధ విధానాలు, బుజ్జగింపు రాజకీయాలు అందరికీ తెలిసిపోయాయి. బీజేపీ ఉప్పెనలో కాంగ్రెస్‌ అబద్ధాలన్నీ కొట్టుకుపోతాయి. భారీ మెజారిటీతో బీజేపీకే మళ్లీ పట్టం కట్టాలని ప్రజలు నిశ్చయానికి వచ్చారు. లభిస్తున్న భారీ స్పందనను చూస్తే.. కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున పోరాడుతున్నది ప్రజలే అని నాకు నమ్మకం కలుగుతోంది’అని ప్రధాని అన్నారు.

బీజేపీ హయాంలో బీఎస్‌ యడియూరప్ప, ప్రస్తుతం సీఎం బొమ్మైల డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వాలు తక్కువ కాలమే అయినా రాష్ట్రం ఎంతో అభివృద్ధి సాధించిందని తెలిపారు. ప్రధాని మోదీ అంతకుముందు బెంగళూరు నగరంలో భారీ రోడ్‌షోలో పాల్గొన్నారు. రోడ్డుకు రెండు వైపులా నిలబడిన ప్రజలకు చేతులు ఊపుతూ ఆయన ముందుకు కదిలారు. దక్షిణ బెంగళూరులోని సోమేశ్వర్‌ భవన్‌ ఆర్‌బీఐ గ్రౌండ్‌ నుంచి మల్లేశ్వరంలోని సాంకే ట్యాంక్‌ వరకు 26 కిలోమీటర్ల మేర, 17 నియోజకవర్గాల మీదుగా చేపట్టిన ఈ రోడ్‌షో దాదాపు మూడు గంటలపాటు సాగింది.

85% కమీషన్లు కాంగ్రెస్‌కు అలవాటే
‘కర్ణాటకలో కాంగ్రెస్‌ పాలన దశాబ్దాలపాటు సాగింది. కానీ, అభివృద్ధే జరగలేదు. కాంగ్రెస్‌ అంటే.. పూర్తి అవినీతి, కుంభకోణం, 85% కమిషన్, ఉగ్రవాదులకు దాసోహం, బుజ్జగింపు వ్యవహారాలు, విభజన రాజకీయాలు’అని ప్రధాని పేర్కొన్నారు. ఢిల్లీ నుంచి రూ.1 విడుదలైతే ప్రజలకు 15 పైసలు అందుతుందని అప్పట్లో కాంగ్రెస్‌ మాజీ ప్ర«ధాని రాజీవ్‌ గాంధీ చెబుతుండేవారని గుర్తు చేశారు.

అప్పటి నుంచే 85 శాతం కమీషన్‌ కాంగ్రెస్‌కు అలవాటైందని ఎద్దేవా చేశారు. తప్పుడు హామీలివ్వడం అధికారంలోకి వచ్చాక వాటిని మర్చిపోవడం కాంగ్రెస్‌కు అలవాటేనన్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లో మాదిరిగానే కర్ణాటకలోనూ అధికారంలోకి వస్తే ప్రజలకిచ్చిన వాగ్దానాలను కాంగ్రెస్‌ బుట్టదాఖలు చేస్తుంది’అని చెప్పారు. మాజీ సీఎం, బాదామి బరిలో ఉన్న కాంగ్రెస్‌ నేత సిద్దరామయ్యపైనా ప్రధాని విమర్శలు గుప్పించారు.

‘గాలి ఎటువీస్తోందో సిద్దరామయ్య ఇప్పటికి గ్రహించే ఉంటారు. ఆయన ఇక్కడికి వస్తే.. గతంలో కనీస మౌలిక వసతులను ప్రజలకు ఎందుకు కల్పించలేకపోయారని నిలదీయండని పిలుపునిచ్చారు. ‘బీజేపీకి వస్తున్న ప్రజల ఆదరణ చూసి కాంగ్రెస్‌కు భయం మొదలైంది. అందుకే నిరంతరం ఆరోపణలు చేస్తున్నారు’అని అన్నారు. పేదల కష్టాలను అర్థం చేసుకోలేని కాంగ్రెస్‌వి నీచమైన విధానాలని ఆరోపించారు.
బెంగళూరులో రోడ్‌షోలో ప్రజలకు మోదీ అభివాదం

మరిన్ని వార్తలు