మతమార్పిడి నిరోధక బిల్లుకు కర్ణాటక అసెంబ్లీ ఆమోదం

24 Dec, 2021 06:18 IST|Sakshi

బెళగావి(కర్ణాటక): వివాదాస్పద మత మార్పిడి నిరోధక బిల్లుకు కర్ణాటక శాసన సభ గురువారం ఆమోదముద్ర వేసింది. రాష్ట్రంలో వివాదాస్పదంగా మారిన మత మార్పిడిల సమస్యకు పరిష్కార మార్గంగా ‘కర్ణాటక మత స్వేచ్ఛ పరిరక్షణ బిల్లు–2021’ను తెచ్చినట్లు రాష్ట్ర సీఎం బసవరాజ్‌ బొమ్మై స్పష్టం చేశారు. ఈ బిల్లును కాంగ్రెస్‌ సభ్యులు సభలో  వ్యతిరేకించారు. వెల్‌లోకి దూసుకెళ్లి నిరసన తెలిపారు. నిరసనలు, ఆందోళనల మధ్య సభ బిల్లును మూజువాణి ఓటుతో ఆమోదించింది. ప్రజావ్యతిరేక, అమానవీయ, చట్టవ్యతిరేక బిల్లును తెచ్చారంటూ కాంగ్రెస్‌ తీవ్రంగా విమర్శించింది. జేడీ(ఎస్‌) సైతం బిల్లును తప్పుబట్టింది.

ఈ తరహా చట్టం ఇప్పటికే ఎనిమిది రాష్ట్రాల్లో అమల్లో ఉందని బిల్లును ప్రవేశపెట్టిన హోం మంత్రి పేర్కొన్నారు. బిల్లు.. మత స్వేచ్ఛను పరిరక్షిస్తూనే బలవంతపు, ఇంకొకరి ప్రోద్భలంతో, తప్పుడు పద్ధతిలో జరిగే మత మార్పిడిలను అడ్డుకుంటుంది. చట్టవ్యతిరేకంగా, నిబంధనలను అతిక్రమిస్తూ మత మార్పిడి జరిగితే నేరంగా పరిగణించి, రూ.25వేల జరిమానా, మూడు నుంచి ఐదేళ్ల జైలు శిక్ష విధిస్తారు. సామూహిక మత మార్పిడి నేరానికి గరిష్టంగా పదేళ్ల జైలు, రూ.1లక్ష జరిమానా విధిస్తారు. బిల్లు ప్రకారం ఇలాంటి వాటిని నాన్‌–బెయిలబుల్‌ నేరంగా పరిగణిస్తారు.

మరిన్ని వార్తలు