31వ జిల్లాగావిజయనగర

28 Nov, 2020 07:09 IST|Sakshi

కొత్త జిల్లాలోకి ఆరు తాలూకాలు 

మంత్రివర్గ సమావేశంలో తీర్మానం

సాక్షి బెంగళూరు : విజయనగర జిల్లా ఏర్పాటుకు ఆమోదముద్ర పడింది. బళ్లారి జిల్లాను రెండుగా విభజించి 31వ జిల్లాగా విజయనగర (హొసపేటె)ను  ఏర్పాటు చేస్తూ శుక్రవారం ముఖ్యమంత్రి బీఎస్‌ యడియూరప్ప అధ్యక్షతన నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. కొత్తగా ఏర్పడే జిల్లాలోకి హొసపేటె, హరపనహళ్లి, హూవినహడగలి, హగరి బొమ్మనహళ్లి, కొట్టూరు, కూడ్లిగి తాలూకాలు రానున్నాయి.  మిగతా బళ్లారి, సిరుగుప్ప, సండూరు, కురుగోడు, కంప్లి తాలూకాలు బళ్లారి జిల్లాలోనే కొనసాగుతాయని మంత్రివర్గ సమావేశం అనంతరం పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి జేసీ మాధుస్వామి మీడియాకు తెలిపారు.    (‘గోవధ నిషేధంపై త్వరలోనే బిల్లు’)

బళ్లారి జిల్లాలో ఇప్పటివరకు బళ్లారి,  హొసపేటె, కూడ్లిగి, హగరిబొమ్మనహళ్లి, హడగలి, కంప్లి, సిరుగుప్ప,  సండూరు, హరపనహళ్లి తాలూకాలు ఉన్నాయి. హొసపేటె కేంద్రంగా విజయనగర జిల్లా ఏర్పాటు చేయాలని 20 ఏళ్లుగా డిమాండ్లు ఉన్నాయి. హొసపేటెను విజయనగర జిల్లాగా ఏర్పాటు చేస్తామని బీజేపీ  హామీ ఇవ్వడంతో కాంగ్రెస్‌లో ఉన్న హొసపేటె ఎమ్మెల్యే, ప్రస్తుత అటవీ శాఖామంత్రి ఆనంద్‌సింగ్‌ బీజేపీలో చేరారు. ఇచ్చిన హామీ మేరకు  విజయనగర జిల్లా ఏర్పాటుకు ఈనెల 19న జరిగిన కేబినెట్‌ సమావేశంలో  తాత్కాలికంగా ఆమోదం వేశారు. శుక్రవారం జరిగిన కేబినెట్‌ సమావేశంలో విజయనగర జిల్లా ఏర్పాటుకు పూర్తి ఆమోదముద్రవేశారు. బళ్లారిని ముక్కలు చేయరాదని బళ్లారి సిటీ బీజేపీ ఎమ్మెల్యే గాలి సోమశేఖరరెడ్డి అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ ప్రభుత్వం విజయనగర జిల్లాకు ఆమోదముద్ర వేసింది.     (పవన్‌ కల్యాణ్‌పై తమిళ మీడియా సెటైర్లు)  

మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న మరిన్ని నిర్ణయాలు
►కర్ణాటక గృహ మండలిలో రూ.2,275 కోట్లతో 98 వసతి పథకాలు అమలు  
►ధారవాడ రైల్వే స్టేషన్‌ యార్డు సమీపంలో రూ.16.48 కోట్లతో ఉపరితల వంతెన నిర్మాణం 
►సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్కు సహకారంతో ఉత్పాదన కేంద్రం నిర్మాణం, విశ్వేశ్వరయ్య టెక్నాలజీ యూనివర్సిటీ కట్టడ నిర్మాణాలకు రూ.42.93 కోట్ల కేటాయింపు  
►ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్‌ ఉద్యోగాల భర్తీకి కేబినెట్‌ సబ్‌కమిటీ ఏర్పాటు  
►కర్ణాటక గెజిటెడ్‌ ప్రొబేషనరీ నియామకాల్లో సవరణలకు ఆమోదం   
►బెంగళూరు గ్రామీణ జిల్లా బాశెట్టిహళ్లి, దావణగెరె జిల్లా హొన్నాళిని ప.పం. నుంచి∙పురసభ, బెంగళూరు నగరం యలహంకలోని హుణసమారహళ్లి పురసభ, అథణి, కాగవాడను పట్టణ పంచాయతీలుగా అప్‌గ్రేడ్‌  
►శివమొగ్గ విమానాశ్రయం అభివృద్ధికి రూ.380 కోట్లు 
►బళ్లారి జిల్లా జిందాల్‌కు భూ కేటాయింపుల కోసం మరోసారి పరిశీలన 
►బీబీఎంపీ పరిధిలోకి మల్లసంద్ర, కావల్‌శెట్టిహళ్లి గ్రామ పంచాయతీలు 
►మెట్రో రైలు అనుసంధాన ప్రక్రియలో భాగంగా ముగ్గురు సభ్యులతో కమిటీ   
►ఎక్స్‌పీరియన్స్‌ బెంగళూరు పథకంలో భాగంగా మైసూరు ల్యాంప్స్‌ పరిశ్రమలో భూమి, ఉపకరణాల కొనుగోలుకు తీర్మానం

మరిన్ని వార్తలు