కర్ణాటక సీఎం మార్పుపై బీజేపీ నేతల కీలక వ్యాఖ్యలు.. మార్పు తప్పదా?

10 Aug, 2022 16:03 IST|Sakshi

బెంగళూరు: కర్ణాటకలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా పర్యటన తర్వాత.. మరోమారు ముఖ్యమంత్రి మార్పు ఉండబోతోందని బీజేపీలో చర్చ మొదలైంది. ఆగస్టు 15వ తేదీలోపు సీఎం బసవరాజ్‌ బొమ్మై స్థానంలో మరొకరిని కూర్చోబొట్టనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో మార్పులపై మాట్లాడిన వారిలో బీజేపీ లీడర్‌ బసనగౌడ పాటిల్‌ సైతం ఉన్నారు. ఆయన గతంలో బీఎస్‌ యడియూరప్పను తొలగించి బసవరాజ్‌ బొమ్మైని ముఖ్యమంత్రి చేయనున్నారని అంచనా వేశారు. ఏడాది తర్వాత ఆయన అంచనాలే నిజమయ్యాయి. పాటిల్‌ తాజాగా మరోమారు అలాంటి వ్యాఖ్యలే చేశారు. పార్టీకి మేలు చేసే నిర్ణయం అధిష్టానం తీసుకుంటుందన్నారు. ఆయన మాటలను బీ సురేశ్ గౌడ ఏకీభవించారు. దీంతో బొమ్మైకి వీడ్కోలు పలకక తప్పదనే సంకేతాలిచ్చారు.  

మరోవైపు.. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు నలిన్‌ కుమార్‌ కతీల్‌ ఈ వాదనలను తోసిపుచ్చారు. బసవరాజ్‌ బొమ్మై తన పదవీ కాలాన్ని పూర్తి చేస్తారని పేర్కొన్నారు. దక్షిణ కన్నడ జిల్లీలో బీజేపీ యూత్‌ వింగ్‌ నేత హత్య తర్వాత బొమ్మైకి మరిన్ని చిక్కులు వచ్చాయి. సొంత ప్రజలను కాపాడుకోవటంలో ప్రభుత్వం విఫలమైందని పార్టీ శ్రేణులు ఆందోళనలు చేపట్టాయి. మరోవైపు.. సీఎం కానీ, రాష్ట్ర అధ్యక్షుడిని కానీ తొలగించే ఆలోచన లేదని, వారి నేతృత్వంలోనే ఎన్నికలకు వెళ్తామన్నారు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ఆర్‌ అశోక. బొమ్మై కీలుబొమ్మగా పేర్కొంటూ కాంగ్రెస్ పార్టీ ట్వీట్‌ చేయగా..  మీకు ప్రధాని మోదీ, అమిత్‌ షాలు చెప్పారా? అంటూ సమాధానమిచ్చారు అశోక. 

2018లో జరిగిన ఎన్నికల్లో కాషాయ పార్టీ విజయం సాధించలేకపోయింది. అయితే.. ఏడాది తర్వాత కాంగ్రెస్‌-జేడీఎస్‌ కూటమిని కూలదోసి బీఎస్‌ యడియూరప్ప ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత రెండేళ్లకు 2021, జూలైలో బసవరాజ్‌ బొమ్మైని ముఖ్యమంత్రిని చేశారు. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు 2023, మేలో ఉండనున్నాయి.  ఈ నేపథ్యంలో మరోమారు ముఖ్యమంత్రి మార్పుపై వార్తలు వెలువడుతున్నాయి. 

ఇదీ చదవండి: ఆగస్టు 21 నుంచి కాంగ్రెస్‌ అధ్యక్ష ఎన్నికలు.. రాహుల్‌ గాంధీ పోటీ చేస్తారా?

మరిన్ని వార్తలు