బుద్దుండక్కర్లేదా?.. అంతా మీకేనా!

23 May, 2022 19:22 IST|Sakshi
ఖనిజ సంపద దోపిడీతో రాష్ట్ర ఖజానాకు, పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లుతోంది

సాక్షి, బెంగళూరు: రాష్ట్రంలో అక్రమ గనులు.. ప్రత్యేకించి రాళ్ల గనులు, కొండలు యథేచ్ఛగా దోపిడీకి గురవుతున్నాయి. డ్రోన్‌ సర్వే, టాస్క్‌ఫోర్స్‌ కమిటీ, ప్రత్యేక కార్యచరణ తదితర ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ అక్రమ గనుల తవ్వకాలది అదే దారి. ఒక చోట తవ్వకాలకు అనుమతులు తీసుకుని ఇతర ప్రాంతాల్లో గనులు తవ్వేయడం, అధికారులు, రాజకీయ నేతల అండదండలతో విచ్చలవిడిగా గనులు తవ్వుకుని కోట్లాది రూపాయలను వెనకేసుకోవడం పరిపాటిగా మారింది. ప్రభుత్వం చర్యలు నామమాత్రమే అవుతున్నాయని  పర్యావరణవాదులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.  

ఈ జిల్లాల్లో అధికం  
బెంగళూరు రూరల్, రామనగర, కొప్పళ, చిక్కబళ్లాపుర, కోలారు, చామరాజనగర, బీదర్, శివమొగ్గ, మండ్య, మైసూరు, దక్షిణకన్నడ, బళ్లారి, తుమకూరు, విజయపుర తదితర జిల్లాల పరిధిలో చాలా చోట్ల అనుమతులు లేకుండా వేలాది ఎకరాల్లో రాళ్ల గనులు తవ్వుతున్నట్లు గనుల శాఖ రికార్డుల ద్వారా తెలుస్తోంది. వీటికి అనుబంధంగా వందలాది జల్లిక్రషర్లను ఏర్పాటుచేసుకుని కంకర, రాతి ఇసుకగా మార్చి అమ్ముకుంటున్నారు.  

మూడేళ్లలో 13 వేల కేసులు  
గత మూడేళ్ల వ్యవధిలో సుమారు 13 వేలకు పైగా కేసులు నమోదు చేసినట్లు తెలిసింది. 2019 – 20 సంవత్సరంలో 4,935 కేసులు, 2020 – 21లో 5,584, 2021 – 22లో 2,996 కేసులు నమోదయినట్లు సమాచారం. ఇందులో 70.15 శాతం కేసుల్లో అరకొర జరిమానా విధించారు. కొందరికి మాత్రమే జైలు శిక్ష పడింది. గనుల వెనుక బలమైన వ్యక్తులే ఉండడం వల్ల జరిగేదేమిటో అందరికీ తెలిసిందే. గనులు– ఖనిజాలు –1957 చట్టం ప్రకారం గనులు, తవ్వకాలు, రవాణా అనేది రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన విషయం. అక్రమ గనుల తవ్వకాలను నియంత్రించే బాధ్యత కూడా ప్రభుత్వానిదే.  

తరచూ పేలుళ్లు, నేరాలు  
మండ్యజిల్లాలో ప్రసిద్ధ కేఆర్‌ఎస్‌ డ్యాం దెబ్బతినేలా సమీపంలో రాళ్ల గనులను తవ్వుతున్నారని ఆరోపణలు రావడం తెలిసిందే. గతేడాది జనవరిలో శివమొగ్గలో గనుల పేలుడుపదార్థాలు పేలి ఆరుమంది కార్మికులు దుర్మరణం చెందారు. ఆ మరుసటి నెలలోనే చిక్కబళ్లాపురలోనూ ఇదే తరహాలో పేలుళ్లు సంభవించి మరో ఆరుగురు గని కార్మికులు మృత్యువాత పడ్డారు. తరచూ గనుల వద్ద ప్రమాదాలతో ప్రాణనష్టం జరుగుతోంది. అదేరీతిలో కిడ్నాప్‌లు, హత్యలూ చోటుచేసుకోవడం గమనార్హం.

చదవండి: వీడియో: అబ్బా..! దళిత స్వామిజీతో ఎమ్మెల్యే ‘ఎంగిలి కూడు’ చేష్టలు వైరల్‌

మరిన్ని వార్తలు