DK Shivakumar: కర్ణాటక పీసీసీ చీఫ్‌ ఇంట్లో సీబీఐ సోదాలు.. ‘నాపైనే ఎందుకు దర్యాప్తు?’

29 Sep, 2022 11:20 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ నివాసం, ఆయనకు సంబంధించిన ఇతర ప్రాంతాల్లో సీబీఐ అధికారులు బుధవారం సోదాలు నిర్వహించారు. రామనగర జిల్లాలోని ఆయన స్వగ్రామంతోపాటు కనకపుర, దొడ్డనహళ్లి, సంతే కొడిహళ్లిలో ఈ సోదాలు జరిగాయి. శివకుమార్‌కు చెందిన ఆస్తులు, భూములు, వాటికి సంబంధించిన పత్రాలను అధికారులు పరిశీలించారు. కనకపుర తహసిల్దార్‌ను కలుసుకున్నారు.

శివకుమార్‌ ఆస్తుల వివరాలపై ఆరా తీశారు. 2017లో శివకుమార్‌ ఇళ్లు, కార్యాలయాలపై ఐటీ శాఖ దాడులు చేపట్టింది. ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నట్లు గుర్తించింది. అనంతరం ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ), తర్వాత సీబీఐ పరిధిలోకి వచ్చింది. శివకుమార్‌పై దర్యాప్తు కొనసాగించేందుకు 2019 సెప్టెంబర్‌ 25న కర్ణాటక ప్రభుత్వం సీబీఐకి అనుమతి మంజూరు చేసింది.    

మానసికంగా వేధిస్తున్నారు
సీబీఐ దాడులపై డీకే శివకుమార్‌ స్పందించారు. దాడుల పేరుతో తనను మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నారని అన్నారు. ‘నేను చట్టాన్ని గౌరవిస్తాను. వాళ్లు అడిగిన పత్రాలు ఇప్పటికే ఇచ్చాను. అయినప్పటికీ వారు నా ఆస్తులను తనిఖీ చేశారు. ఎంతోమంది ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నప్పటికీ నా కేసులో మాత్రమే సీబీఐకి అనుమతి లభించింది. సీబీఐ నాపై మాత్రమే ఎందుకు దర్యాప్తు చేస్తోంది?’ అని శివకుమార్ ప్రశ్నించారు.
చదవండి: అక్టోబర్‌లో అమిత్‌ షా పర్యటన.. జమ్మూ కశ్మీర్‌లో జంట పేలుళ్ల కలకలం

మరిన్ని వార్తలు