వీడియో: సినిమా చూసి చిన్నపిల్లాడిలా వెక్కి వెక్కి ఏడ్చేసిన సీఎం

14 Jun, 2022 14:48 IST|Sakshi
777 ఛార్లీ మూవీ స్క్రీనింగ్‌లో సీఎం బొమ్మై

బెంగళూరు: భావోద్వేగాలు మనిషికి సహజం. అందులో తెర మీద చూసినప్పుడు మరింత భావోద్వేగానికి లోనవుతుంటారు. అందుకే ఆ ముఖ్యమంత్రి ఆ సినిమాను చూసి వెక్కి వెక్కి ఏడ్చేశారు. ఆయన అంతలా ఎమోషనల్‌ కావడానికి ఓ ప్రత్యేకమైన కారణం కూడా ఉందండోయ్‌. 

కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై.. తాజాగా రక్షిత్‌ శెట్టి లీడ్‌ రోల్‌లో నటించిన ‘777 ఛార్లీ’ సినిమా చూశారు. మనిషికి, పెంపుడు కుక్క మధ్య ఉన్న బాండింగ్‌ను ఎంతో అద్భుతంగా తెరకెక్కించాడు దర్శకుడు కిరణ్‌రాజ్‌. అయితే ఈ సినిమా ప్రత్యేక ప్రదర్శన చూసి కర్ణాటక సీఎం బసవరాజ్‌ బొమ్మై ఒక్కసారిగా ఏడ్చేశారు.

బొమ్మై గతంలో స్నూబీ అనే కుక్కను పెంచారు. ఆయన సీఎం పదవి చేపట్టడం కంటే ముందే ఆ శునకం కన్నుమూసింది. దాని అంత్యక్రియల సమయంలో వెక్కి వెక్కి ఏడ్చారాయన. అంతేకాదు సీఎం అయ్యాక.. ఓ ఇంటర్వ్యూలో స్నూబీ ఫొటోల్ని చూపించగా కన్నీటి పర్యంతం అయ్యారు.  

కుక్కల మీద గతంలో సినిమాలు వచ్చాయి. కానీ, ఈ సినిమాలో భావోద్వేగాలతో చూపించారు. చార్లీ కేవలం తన కళ్ల ద్వారా భావోద్వేగాలను వ్యక్తపరుస్తుంది. సినిమా బాగుంది, అందరూ తప్పకుండా చూడాల్సిందే. షరతులు లేని ప్రేమ(అన్‌కండిషనల్‌ లవ్‌) గురించి మాట్లాడుతున్నాను. కుక్క ప్రేమ అనేది షరతులు లేని ప్రేమ, చాలా స్వచ్ఛమైనది.. అంటూ కన్నీళ్లు తుడుచుకుంటూ మాట్లాడారాయన.

మరిన్ని వార్తలు