రాహుల్‌ ఓ ఫెయిల్డ్‌ మిసైల్‌.. కాంగ్రెస్‌ మళ్లీ ప్రయోగిస్తోంది: బొమ్మై

15 Oct, 2022 16:32 IST|Sakshi

బెంగళూరు: కాంగ్రెస్‌ పార్టీకి పునర్వైభవం తీసుకొచ్చేందుకు ‘భారత్‌ జోడో యాత్ర’ పేరుతో దేశవ్యాప్తంగా పాదయాత్ర చేస్తున్నారు రాహుల్‌ గాంధీ. ఈ క్రమంలో రాహుల్‌ గాంధీ, భారత్‌ జోడో యాత్రపై విమర్శలు గుప్పించారు కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై. రాహుల్‌ గాంధీ ఓ విఫలమైన క్షిపణిగా అభివర్ణించారు. భారత్‌ జోడో యాత్ర పేరుతో మరోమారు ఫెయిల్డ్‌ మిసైల్‌ను కాంగ్రెస్‌ ప్రయోగిస్తోందని ఎద్దేవా చేశారు. దేశం మొత్తం ఏకమైందని, ఫెడరలిజాన్ని నమ్ముతున్న తరుణంలో ఇలాంటి యాత్రలు అర్థరహితమని దుయ్యబట్టారు. 

‘దేశం బలమైన స్థానంలో ఉన్నప్పుడు ఇలాంటి యాత్రలు చేయటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. గతంలోనే రాహుల్‌ గాంధీ అనే మిసైల్‌ విఫలమైందని నేను చెప్పాను. ఇప్పుడు, మళ్లీ ఆయన్నే కాంగ్రెస్‌ ప్రయోగిస్తోంది. దానిని పక్కనబెడితే.. అసలు ఈ యాత్రకు అర్థమే లేదు.’ అని పేర్కొన్నారు బొమ్మై. దేశ ఖ్యాతి విశ్వవ్యాప్తమవుతున్న తరుణంలో క్రమంలో దేశాన్ని ఏకం చేస్తామనేందుకు అసలు అవకాశమేలేదన్నారు బొమ్మై. జీ7తో పాటు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటే.. భారత్‌ 7 శాతం వృద్ధి నమోదు చేసిందని గుర్తు చేశారు. బీజేపీ చేపట్టిన జన సంకల్ప యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందని తెలిపారు.

ఇదీ చదవండి: బీజేపీ, ఆర్‌ఎస్ఎస్ దేశాన్ని విభజిస్తున్నాయి.. అందుకే పాదయాత్రకు ఆ పేరు..

మరిన్ని వార్తలు